అలవాటులో పొరపాటు… చైతన్య విద్యార్థులకు గ్రహపాటు.

Sri Chaitanya College Students Gets Problems with Management

యాజమాన్యాల నిర్లక్ష్యం, స్వార్ధం ఒక్కోసారి విద్యార్థులకు ఎలా శాపంగా పరిణమిస్తాయో చెప్పేందుకు ఫాతిమా మెడికల్ కాలేజ్ ఉదంతం పెద్ద ఉదాహరణ. ఆ కాలేజ్ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకున్నా విద్యార్థులు ఇబ్బంది పడక తప్పని పరిస్థితి. ఇలాంటి అనుభవాలతో అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనుకుంటే పొరపాటే. హైదరాబాద్ నడిబొడ్డున ఎస్సార్ నగర్ లో 15 ఏళ్ళకి పైగా బ్రాంచ్ లు నడుపుతున్న చైతన్య కాలేజీ నిర్లక్ష్యంతో ఇప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రతి ఏటా ఇక్కడ నడుస్తున్న మూడు బ్రాంచ్ లకి పరీక్షా కేంద్రాలు వచ్చేవి. ఈసారి పరీక్షా కేంద్రాలకు అనుమతి రాలేదని సమాచారం. అందుకు ఆ మూడు బ్రాంచ్ లకి సంబంధించిన అఫిలియేషన్ ప్రక్రియ ని సాఫీగా జరిపించకపోవడమే కారణం అని టాక్. సదరు కార్పొరేట్ కాలేజ్ సాధారణంగా జరిగిపోయే ఈ ప్రక్రియలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అఫిలియేషన్ సాఫీగా గా జరగలేదని తెలుస్తోంది .

తాజా పరిణామం వల్ల దాదాపు 1800 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే 10 th నుంచి ఇంటర్ లో చేరి ఆపై డాక్టర్ అవుదామనో, ఇంజనీర్ అవుదామనో సదరు కాలేజ్ బ్రాండ్ నేమ్ చూసి వచ్చే విద్యార్థుల పరిస్థితి ఏంటి ? ఇంటర్ విద్యావ్యవస్థ గురించి తెలిసినవాళ్లకు అంతటి చైతన్యం కలిగిన కాలేజ్ ఇంత చిన్న ప్రక్రియను సజావుగా పూర్తి చేయలేకపోతోందా అని ఆశ్చర్యం కలుగుతోంది. చైతన్య కి వెన్నుముక అనుకునే ప్రధాన బ్రాంచ్ ల విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక మిగిలిన వాటి సంగతి ఏంటో ?. ప్రస్తుతం ఆ సంస్థ ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించవచ్చు. ఒకవేళ ఏదేని అనుకోని పరిణామాలు ఎదురైతే… ఆ విద్యార్థుల భవిష్యత్ కి ఎవరు జవాబుదారీ ?. ఒక విద్యార్థి తండ్రి ఈ పరిణామాల గురించి ఆరా తీసి ఇలాంటి చోట ఎందుకు పిల్లోడిని చేర్చానా అని మధనపడుతున్నారు. ఆ విషయం బయటకు వస్తే మిగిలిన తల్లిదండ్రుల పరిస్థితి అంతే… ఇక విద్యార్థుల గురించి చెప్పక్కర్లేదు. ఒక్కో సారి ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు సైతం పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అయినా పాఠాలు చెప్పాల్సిన వాళ్ళకే ఇలాంటి విషయాల్లో చెప్పాల్సిరావడం దురదృష్టకరం.