Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ, టీడీపీ మధ్య నాలుగేళ్ల కస్సుబుస్సులు కాస్త యుద్ధం గా మారిన ఈ తరుణంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి భేటీ అయ్యారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరు ఎవరితో నడుస్తున్నారో అర్ధం కానీ ఈ పరిస్థితుల్లో, జనం అన్ని రాజకీయ పార్టీలని సందేహంతో చూస్తున్న ఈ వాతావరణంలో సుజనా వెళ్లి జైట్లీతో మాట్లాడ్డం టీడీపీ కి ఇబ్బందే. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా పార్టీ నేతలు ప్రస్తావించారు. చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయం మీద సుజనాని ప్రశ్నిస్తే పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడేందుకు జైట్లీ పిలిచారని సుజనా వివరించారు. అయితే హోదా గురించి జైట్లీ ప్రస్తావించలేదని సుజనా అన్నారు. ఎక్కడైనా బయట కనిపిస్తే మాట్లాడ్డం వేరే గానీ ఇలాంటి సమయంలో బీజేపీ పెద్దలతో కలవడం మంచిది కాదన్న అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేశారు.
ఇక సుజనా భేటీ గురించి బయటకు వచ్చిన వెంటనే నిన్న శివాజీ చెప్పిన సంచలన అంశాల్లో అధికార పార్టీలో కోవర్ట్ విషయం మీద చర్చ ఎక్కువ అయ్యింది. సుజనాని ఆ స్థానంలో ఊహించి సోషల్ మీడియాలో కధనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ నిజంగానే ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో టీడీపీ ఎంపీ ఒకరు, కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జైట్లీ తో భేటీ అనే సరికి ఎక్కడో మళ్లీ రాజీ ప్రయత్నాలు సాగుతున్నాయా అన్న డౌట్స్ వస్తున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సుజనాని చంద్రబాబే చర్చలకు పంపి ఇప్పుడు యనమల లాంటి వాళ్ళతో ప్రశ్నించేలా చేశారని విజయసాయి ఆరోపిస్తున్నారు. ఒకే గేమ్ ని చంద్రబాబు రెండువైపులా ఆడుతూ జనాన్ని మోసం చేస్తున్నరని విజయసాయి అంటున్నారు. ఈ వాదనలో ఎక్కడ బీజేపీ మళ్లీ టీడీపీ కి దగ్గర అవుతుందో అన్న భయం కనిపిస్తోంది.