సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు అయినా ఇప్పటి వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఓ ఫ్యాన్స్ వేదిక పెట్టారు. “మక్కల్ మండ్రమ్” పేరుతో అభిమానులను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. ఆ మండ్రమ్ కార్యక్రమాలు ఏవీ పెద్దగా జరగడం లేదు. త్వరలో తమిళనాడులో ఇరవై అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు రాబోతున్నాయి. అలాగే మరో రెండు, మూడు నెలలు అటూ ఇటుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయినా సరే రజనీకాంత్ సినిమా తర్వాత సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. షాట్ గ్యాప్ లో కూడా రాజకీయం ఆలోచిస్తున్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది. కానీ రాజకీయం పేరుతో టీవీ చానెళ్ళు మాత్రం ఫ్యాన్స్ తో పెట్టిస్తున్నారు. తాజాగా ఓ టీవీ చానల్ ను ఆయన అభిమానులు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తన పేరుతో ఓ టీవీ ఛానల్ కూడా ఏర్పాటు చేయడానికి ఓ వీరాభిమానికి చాన్సిచ్చారు. దాని కోసం చేసుకున్న దరఖాస్తు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఛానల్ కోసం రజినీ అభిమానుల సంఘం కన్వీనర్ సుధాకర్ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో అప్లై చేశారు. రజినీ తన పేరు, ఫొటోను ఉపయోగించుకునేందుకు సమ్మతిని తెలుపుతూ ఓ లేఖ కూడా ఇచ్చారు. నవంబర్ 9న అప్లై చేశారు. అయితే కేవలం న్యూస్ మాత్రమేనా.. లేక ఎంటర్టైన్మెంట్ ఛానలా అన్నది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ టీవీ, రజినీ టీవీ, తలైవార్ టీవీ పేర్ల కోసం అప్లై చేయగా ఆరు లోగోలను కూడా దరఖాస్తులతో పాటు జతచేశారు. అందులో సూపర్ స్టార్ టీవీకి రజినీకాంత్ క్యారికేచర్స్‌తో కూడిన లోగో ఇచ్చారు. రజనీ అనుమతి లేఖ కూడా ఉండటంతో ఇది నిజమేననుకుంటున్నారు. ఈ నెల పన్నెండో తేదీన తన పుట్టిన రోజు పార్టీ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. ఆయన మాత్రం సినిమా టీజర్ రిలీజ్ చేశారు. రాజకీయాలు పెద్దగా మాట్లాడలేదు. మరి ఈచానెళ్ళు దేనికి సంకేతమో మరి ?