వివాదాస్పద అయోధ్య – బాబ్రీ మసీదు కేసు విచారణ ట్విస్ట్ తో వాయిదా పడింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన 14 పిటిషన్లపై ఇవాళ్టి నుంచి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన సమయంలో రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తప్పుకోవడం సంచలనంగా మారింది. ఆయన లలిత్ తప్పుకోవడంతో కేసు ఈ నెల 29వ తేదీకి వాయిదా పడింది. దీంతో మరో ధర్మాసనాన్ని ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. గతంలో ఈ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే, జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. తాజాగా ఈ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అయితే బెంచ్‌లో జస్టిస్ లలిత్ ఉండటంపై సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ లలిత్ గతంలో ఇదే కేసులో కల్యాణ్‌సింగ్ తరఫున వాదించారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ సభ్యులుగా ఉండటంపై న్యాయవాది ధవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జనవరి 29 నుంచి కొత్త ధర్మాసనం వాదనలు వింటుందని పేర్కొంది.