Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాన్ కార్డ్, బ్యాంక్ ఎకౌంట్, ఫోన్ నంబర్ వంటివాటికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ భారత్ లో దారిద్య్ర రేఖకు దిగువున నిజంగా మగ్గుతున్న వారిని ఆదుకోవాలన్నదే తమ అభిమతమని, సాంకేతికంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఆధార్ కార్యక్రమం నడుస్తోందని, కోర్టులు ఇందులో కల్పించుకోజాలవని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం పారదర్శకతతో కూడినదా…నిజాయితీతో ఉన్నదా అన్న విషయాలను మాత్రమే కోర్టు విచారించగలుగుతుందన్నారు.
ఆధార్ ను ఎంతోమంది నిపుణులు ఆమోదించారని, ఇది విధానపరమైన నిర్ణయం అయినందున న్యాయపరమైన సమీక్ష అవసరం లేదని ఆయన వాదించారు. అటార్నీజనరల్ వాదనలపై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కార్, జస్టిస్ డీవీ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఈ స్కీమ్ ను, ఆధార్ కార్డును వ్యతిరేకిస్తున్నవారి పరిస్థితి ఏంటని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం వేలిముద్రలు, కనుపాపలు సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టా కాదా..అన్న విషయాన్ని విచారిస్తున్నామని చెప్పిన ధర్మాసనం కేంద్రప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్ లో ఆధార్ బోర్డు రక్తం, మూత్రం, డీఎన్ ఏ నమూనాలను కోరదన్న నమ్మకం ఏంటని ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.