Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానులలో ప్రథములని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. కేసులను కేటాయించడం, ధర్మాసనాలను ఏర్పాటుచేయడంలో భారత ప్రధాన న్యాయమూర్తికే సర్వహక్కులూ ఉంటాయని తేల్చిచెప్పింది. కేసుల కేటాయింపులపై మార్గదర్శకాలు తయారుచేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసుల కేటాయింపులు, ధర్మాసనాల ఏర్పాటుపై మార్గదర్శకాలు తయారుచేయాలని కోరుతూ అశోక్ పాండే అనే వ్యక్తి ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవైచంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి సమానులలో ప్రథములని, కేసులను కేటాయించడం, బెంచ్ లు ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకునే హక్కు సీజేఐ కి ఉంటుంది అని జస్టిస్ చంద్రచూడ్ తీర్పును లిఖిస్తూ స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు వ్యవహారాల్లో ప్రధాన న్యాయమూర్తిదే తుదినిర్ణయమని రాజ్యాంగం పేర్కొందని, పారదర్శక పనితీరు కోసం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. చీప్ జస్టిస్ బాధ్యతలపై అవిశ్వాసం తగదని… ఈ పిటిషన్ సీజేఐ పదవికి అపకీర్తి తెచ్చేలా ఉందని పేర్కొంటూ ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరిగా లేదని ఆరోపిస్తూ దేశ చరిత్రలోనే తొలిసారి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకువచ్చి అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి… సమానులలో ప్రథములని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయింది.