Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బలనిరూపణలో బీజేపీ ఓటమి కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్-జేడీఎస్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నియమించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ – జేడీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లగా, దీనిపై ఇవాళ విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ప్రొటెం స్పీకర్ గా బొపయ్యనే కొనసాగించాలని స్పష్టంచేసింది. కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ పార్టీల తరపున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ ప్రొటెం స్పీకర్ గా బొపయ్యను నియమించడం సంప్రదాయాలకు విరుద్ధమని, ఎక్కువసార్లు శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవాలని, కానీ ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి గవర్నర్ బోపయ్యను నియమించారని ఆరోపించారు.
శాసన సభ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించడానికైతే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ… ఆయనే విశ్వాసపరీక్ష చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బలపరీక్ష నిర్వహించడానికి బోపయ్యకు అనుమతి ఇవ్వకూడదని న్యాయస్థానాన్ని కోరారు. కపిల్ సిబాల్ వాదనను తోసిపుచ్చుతూ సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రొటెం స్పీకర్ గా ఈయన్నే నియమించాలని చట్టం ఎలా ఆదేశిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం విషయంలో అర్ధరాత్రి విచారణ చేపట్టామని, కానీ ఇప్పుడు మీరు ప్రొటెం స్పీకర్ విషయంలోనూ జోక్యంచేసుకోవాలని కోరుతున్నారని, కానీ ప్రొటెం స్పీకర్ ను మేం ఎలా నియమించగలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో గవర్నర్ ను ఆదేశించడం చట్టంలో లేదని, సీనియర్ సభ్యులే ప్రొటెంస్పీకర్ గా ఎన్నికవడం అనేది సంప్రదాయమని, అయితే దానికి చట్టబద్ధత లేదని ధర్మాసనం పేర్కొంది.
అంతేగాక గతంలోనూ సీనియర్ సభ్యులు కాని వారు ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన సందర్భాలున్నాయని, ఒకవేళ మీరు అంతగా అడిగితే స్పీకర్ కు నోటీసులు పంపి… విశ్వాసపరీక్షను వాయిదావేస్తామని ధర్మాసనం తెలిపింది. వాదోపవాదాల అనంతరం కాంగ్రెస్ పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం బోపయ్య ప్రొటెంస్పీకర్ గా కొనసాగుతారని, సాయంత్రం 4గంటలకు బలపరీక్ష జరగాలని స్పష్టంచేసింది. ఈ విశ్వాసపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది.