శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళ ప్రవేశం విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆచారం ప్రకారం తరాలుగా ఈ దేవాలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది. కానీ ఇప్పుడు ఆలయంలోకి మహిళలు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని కోర్టు తీర్పునిచ్చింది. మహిళలందరూ దేవుడి సృష్టిలో భాగమే. ఉద్యోగం, పూజల్లో వారి పట్ల వివక్ష ఎందుకని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది.
శబరిమల ఆయంలోకి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చని… అందులో తమకు అభ్యంతరాలేవీ లేవని 2007లో కేరళ సర్కారు ప్రకటించింది. తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సర్కారు దీన్ని వ్యతిరేకించింది. 800 ఏళ్లుగా అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌కు ఈ కేసును అప్పగించింది.