లవ్ జీహాద్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. హదియా తన భర్త సఫిన్ జహాన్ తో కలిసుండొచ్చని భారత ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కేరళకు చెందిన అఖిల అశోకన్… సఫిన్ జహాన్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. సఫిన్ తో పెళ్లితర్వాత తన పేరును అఖిల హదియాగా మార్చుకుంది. అయితే ఈ వివాహం ఇష్టంలేని అఖిల తల్లిదండ్రులు గత ఏడాది కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న సఫిన్ తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని ఆరోపించారు. దీనిపై విచారణ నిర్వహించిన కేరళ హైకోర్టు గత ఏడాది మే నెలలో వారి పెళ్లిని రద్దుచేసింది. హదియా తల్లిదండ్రుల వద్దే ఉండాలని తీర్పు ఇచ్చింది. దీంతో హదియా తల్లిదండ్రులు ఆమెను గృహనిర్బంధం చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సఫిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గత ఏడాది ఆగస్టులో ఈ కేసును సుప్రీంకోర్టు జాతీయ దర్యాప్తు బృందం ఎన్ ఐఏకు అప్పగించింది. హదియా గృహనిర్బంధంపై నవంబర్ లో విచారణ పూర్తిచేసిన అత్యున్నత న్యాయస్థానం ఆమె చదువుకునేందుకు అంగీకరించింది. గురువారం ఆమె వివాహాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు ఇచ్చింది.
తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలకు కొన్ని ఆదేశాలు జారీచేసింది. పెళ్లి విషయంలో ఏదైనా కుట్ర, నేరం జరిగిందా… లేదా అనే విషయాన్ని తెలుసుకునే విధంగా దర్యాప్తు కొనసాగించాలని, అదే సమయంలో దర్యాప్తులో భాగంగా హదియా వైవాహిక జీవితంలో తలదూర్చవద్దని స్పష్టంచేసింది. ఎన్ ఐఏ తరపున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్ దర్యాప్తు దాదాపుగా పూర్తయిందంటూ ఓ నివేదిక సమర్పించారు. ఈ కేసులో గతంలో తనపై వచ్చిన ఆరోపణలను ఎన్ ఐఏ తోసిపుచ్చింది. నేరస్థురాలు లేదా ఉగ్రవాది అనే భావనతో హదియాను విచారించలేదని, దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తిచేశామని తెలిపింది. తన పెళ్లి విషయంలో లవ్ జీహాద్ కు సంబంధం లేదని, తన ఇష్టప్రకారమే ఇస్లాం మతంలోకి మారి సఫిన్ ను వివాహం చేసుకున్నానని హదియా గతంలోనే కోర్టుకు తెలియజేసింది.