Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన కొన్నిరోజులకే ట్రంప్ తీసుకున్న కీలకనిర్ణయం ట్రావెల్ బ్యాన్. గతంలో ఏ అధ్యక్షుడూ చేయని రీతిలో ట్రంప్ ఆరు ముస్లిం దేశాలపై ఒకేసారి ట్రావెల్ బ్యాన్ విధించి… దేశ భద్రత విషయంలో తన వైఖరేంటో నిర్మొహమాటంగా ప్రపంచానికి తెలియజేశారు. ఇరాన్, లిబియా, సిరియా, యెమన్, సోమాలియా, ఛాద్ దేశ పౌరులెవరూ అమెరికా రాకుండా ట్రంప్ విధించిన నిషేధంపై ప్రపంచవ్యాప్తంగానే కాదు… ఆ దేశంలోనూ అనేకమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. కొందరు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానాలు ట్రావెల్ బ్యాన్ పై కొన్ని ఆంక్షలు విధించాయి. సంబంధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రక్త సంబంధీకులు అంటే అమ్మ, నాన్న, కూతురు, కొడుకు వంటివారికి అమెరికాలో శాశ్వత నివాసం ఉంటే ఆ ప్రయాణికులకు దేశంలోకి అనుమతి ఇవ్వాలని కింది కోర్టులు ఆదేశించాయి.
దీంతో వైట్ హౌస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రావెల్ బ్యాన్ అనేది దేశభద్రతకు సంబంధించిన విషయమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అత్యున్నత న్యాయస్థానంలో వాదించింది. ఈ వాదనతో పూర్తిగా ఏకీభవించిన సుప్రీంకోర్టు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. కింది కోర్టులు విధించిన ఆంక్షలను ఎత్తివేసి పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలుచేయాలని ఆదేశించింది. అయితే ఇందులో న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. సుప్రీం తీర్పుతో ఆరు ముస్లిందేశాలతో పాటు అమెరికా నిషేధం విధించిన ఉత్తరకొరియా, వెనెజులా దేశాల పౌరులు ఇకనుంచి అగ్రరాజ్యం లో ప్రవేశించలేరు.