Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది ? ఈ విషయం తెలుసుకుందామనే ఇటీవల రెండు ప్రైవేట్ ఏజెన్సీలతో టీడీపీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో వెల్లడైన ఫలితాలు చూసి సీఎం చంద్రబాబు ఖుషీ అయ్యారట. 2014 తో పోల్చుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ బలం ఇంకా పెరుగుతుందని ఈ సర్వేల ఫలితాలు చెప్పాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కి 140 నుంచి 145 సీట్లు, వైసీపీ కి 20 నుంచి 25 స్థానాలు, జనసేనకు 5 నుంచి 10 సీట్లు వస్తాయని ఈ సర్వే లో తేలింది. ఈ సర్వే లో వెల్లడైన ఇంకో కీలక విషయం ఏమిటంటే రాయలసీమ జిల్లాల్లో కూడా వైసీపీ కన్నా టీడీపీ నే ఎక్కువ సీట్లు గెలుస్తుందట. కిందటి ఎన్నికల్లో 52 స్థానాలకు గాను 23 చోట్ల మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఈసారి ఆ సంఖ్య 30 నుంచి 38 మధ్య వుండే అవకాశం ఉందట.
ఈ ఫలితాలు చూసి మొత్తంగా సీఎం చంద్రబాబు ఖుషీ అయిపోతున్నారు. కానీ మంచి రుచికరమైన విందు భోజనంలో పంటి కింద రాయిలా రెండు జిల్లాల ఫలితాలు వున్నాయట. అవే నెల్లూరు,ప్రకాశం జిల్లాలు. ఈ రెండు జిల్లాల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించినా క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ బలం ఇంకా అలాగే ఉందట. మిగిలిన జిల్లాలతో పోల్చినప్పుడు ఈ రెండు జిల్లాల్లో టీడీపీ అనుకూలత బాగా పెరగకపోవడానికి కారణం ఏమిటనే ఆలోచన చంద్రబాబుని కలవరపెడుతోంది. ఇదే విషయం మీద ప్రత్యేక సర్వే జరపడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారంట. అయితే అమరావతి రాజధాని అనుకున్నాక ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా ఏ ప్రాజెక్ట్ రాకపోవడం, నెల్లూరు రాజకీయాల్లో నారాయణ పెత్తనం వంటి విషయాలు అక్కడ నష్టం చేస్తున్నాయని ప్రాధమికంగా అందిన సమాచారం అట. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సర్వే ఫలితాలు వచ్చాక నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోడానికి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట.