Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కులభూషణ్ తన తల్లిని, భార్యను చూడగానే మొట్టమొదటగా అడిగిన ప్రశ్న నాన్న ఎలా ఉన్నారమ్మా అని…? ఆయన ఆ ప్రశ్న అడగడానికి కారణం కొడుకును కలవడానికి వెళ్తున్న కులభూషణ్ తల్లితో పాకిస్థాన్ అధికారులు బొట్టు, మంగళసూత్రం, గాజులు తీయించడం వల్లే. అలాగే ఎప్పుడూ చీరలే కట్టుకునే ఆమెతో వారు బలవంతంగా కుర్తా-సల్వార్ ధరింపచేశారు. తల్లిని డ్రెస్ లో బొట్టూ, గాజులూ లేకుండా చూడగానే కులభూషణ్ ఏదైనా చెడు జరిగిందేమోనని భయపడ్డాడు. అందుకే నాన్న ఎలా ఉన్నారమ్మా అని అడిగాడు. ఈ వివరాలను కూలభూషణ్ భార్య చేతాంకుల్ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ కు తెలియజేశారు. కులభూషణ్ తల్లి, భార్యతో పాక్ వ్యవహారశైలిపై భారత్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ సుష్మాస్వరాజ్ రాజ్యసభలో దీనిపై ప్రకటన చేశారు. పాక్ తీరును ఎండగట్టారు.
కులభూషణ్ కుటుంబ సభ్యులతో పాకిస్థాన్ వ్యవహరించిన తీరు అమానవీయమని ఆమె మండిపడ్డారు. మానవతాదృక్పథంతో వారి భేటీకి అనుమతిచ్చామని పాక్ చెబుతోందని, కానీ కులభూషణ్ కుటుంబ సభ్యుల కనీస హక్కులను ఆ దేశం పదే పదే ఉల్లంఘించిందని, భేటీ పేరుతో వారికి భయానక వాతావరణం కల్పించిందని సుష్మాస్వరాజ్ విమర్శించారు. కులభూషణ్ తల్లి, భార్యతో బొట్టు, మంగళసూత్రం, గాజులు తీయించారని, దుస్తులు కూడా మార్పించారని సుష్మ చెప్పారు. భారత్ సంస్కృతీ, సంప్రదాయాలను పాకిస్థాన్ ఏ మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఓ ముత్తయిదువను వితంతువుగా మారుస్తారా..అని ప్రశ్నించారు. భర్త బతికుండగా నుదుటున కుంకుమ, తాళిబొట్టు, చేతి గాజులను ఏ భారతీయ మహిళా తీయదన్న విషయం పాక్ అధికారులకు తెలియదా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కులభూషణ్ తల్లి కట్టుకున్న చీరను విప్పించి కుర్తా ధరింపచేయడం కూడా అవమానించినట్టేనని, ఇది ఆమెకొక్కరికే జరిగిన అవమానం కాదని, యావత్ భారత్ మహిళలకు జరిగిన అవమానమని నిప్పులుచెరిగారు. కులభూషణ్ భార్య చెప్పులు కూడా తీసుకున్న పాక్ అధికారులు వాటిని మళ్లీ ఇవ్వలేదని, అందులో కెమెరా, రికార్డింగ్ చిప్ ఉందేమో అని పాక్ అనుమానం వ్యక్తంచేయడం సరైనదికాదన్నారు.అవే చెప్పులతో ఆమె రెండు విమానాల్లో ప్రయాణించారని, ఏమైనా ఉంటే అప్పుడు తెలిసేది కదా అన్నారు. జాదవ్ తల్లిని తమ మాతృభాష మరాఠీలో కూడా మాట్లాడనివ్వలేదని, అలా మాట్లాడుతుంటే ఇంటర్ కమ్ ను ఆపివేశారని సుష్మ తెలిపారు.
పాక్ నిజంగా చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించిందని, దీన్ని అందరూ తీవ్రంగా ఖండించాలని అన్నరు. కులభూషణ్ కుటుంబ సభ్యుల భావోద్వేగ కలయికను పాక్ తన ప్రచార సాధనంగా మలుచుకుందని దుయ్యబట్టారు. కులభూషణ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానంలో స్టే తీసుకురాగలిగామని, ఆయన్ను విడిపించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు. విదేశాంగమంత్రి ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు. కులభూషణ్ భార్య, తల్లిని అవమానించాంటే మొత్తం భారతీయులనే అవమానించినట్టేనని, రాజకీయ విభేదాలులేకుండా అందరూ దీనిపై పోరాడాలని కోరారు