ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది. 100 కోట్ల బడ్జెట్ చిత్రాలు టాలీవుడ్‌లో సర్వసాదారణం అయ్యాయి. ‘బాహుబలి’ చిత్రం తర్వాత సినిమాపై ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, ఆ మొత్తం సినిమాలో మ్యాటర్ ఉంటే వెనక్కు వస్తుందని తేలిపోయింది. అందుకే ప్రస్తుతం ‘సైరా’ మరియు ‘సాహో’ చిత్రాలకు భారీ ఎత్తున బడ్జెట్‌లు కేటాయించారు. సాహో చిత్రం దాదాపు 250 నుండి 275 కోట్ల వరకు ఖర్చుతో తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘సాహో’కు ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. సైరా చిత్రం మొదట 150 కోట్లతో అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 200 కోట్లను మించే అవకాశం ఉందని తెలుస్తుంది
.
మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించబోతున్న ‘సైరా’ చిత్రం కోసం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ యుద్ద సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా సాహో చిత్రం కోసం దుబాయిలో 90 కోట్లు ఖర్చు చేసి భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే మాదిరిగా సైరా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెటింగ్ వేసి భారీగా యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవలం ఆ షెడ్యూల్‌కు ఏకంగా 50 కోట్ల మేరకు ఖర్చు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున జూనియర్ ఆర్టిస్టులతో పాటు, హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాలను ఈ యాక్షన్ సీన్ మరింతగా పెంచుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక సాహో కూడా అదే సమయంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.