సైరా సెట్‌ను కూల్చి వేయడంకు అసలు కారణం ఇదే…!

sye-raa-set-has-demolished-by-revenue-department

చిరంజీవి 152వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించిన సెట్టింగ్‌ను తెలంగాణ ప్రభుత్వ రెవిన్యూ అధికారులు కూల్చి వేశారు అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు రెవిన్యూ అధికారులు ఆ విషయాన్ని నిర్థారించారు. ప్రభుత్వ భూమిలో సెట్‌ వేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రెవిన్యూ శాఖ చెప్పుకొచ్చింది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించని కారణంగా సెట్‌ను కూల్చివేయడం జరిగిందని రెవిన్యూ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన వారు మాత్రం ప్రభుత్వ భూమిలో సెట్‌ వేసిన మాట వాస్తవమే, అందుకు అనుమతి తీసుకున్నాం అంటూ చెబుతున్నారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతం అయిన శేరిలింగంపల్లిలోని ప్రభుత్వంకు చెందిన దాదాపు ఏడున్నర ఎకరాల భూమిని రంగస్థలం చిత్రం కోసం తీసుకోవడం జరిగింది. ఆ చిత్రం కోసం భారీ విలేజ్‌ సెట్టింగ్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు వేశారు. అదే సెట్స్‌లో సైరా చిత్రంకు సంబంధించిన చిత్రీకరణను చేస్తున్నారు. బడ్జెట్‌ కోత కోసం అక్కడ సెట్స్‌లో మార్పులు చేర్పులు చేసి, నరసింహారెడ్డి ఇంటి సెట్‌ను నిర్మించారు. ఇప్పుడు దాన్నే రెవిన్యూ శాఖ వారు తొలగించడం జరిగింది. రెవిన్యూ శాఖ వారు కొంత కాలంగా ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యుల వివరణ కోరినా కూడా స్పందించని కారణంగా తుది ప్రయత్నంగా సెట్‌ను కూల్చి వేశారు. సెట్‌ వేసి ఉంచి, ఆ భూమిని చిరంజీవి కుటుంబం ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిందని, అందుకే సెట్‌ను తీసేసి భూమిని రెవిన్యూ శాఖ స్వాదీనం చేసుకున్నట్లుగా కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం మరియు రాజకీయ నాయకులతో లాలూచి పడి ఆ భూమిని దక్కించుకునేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నించిందని కొందరు ఆరోపిస్తున్నారు.