దీపావళి అయ్యింది…అభ్యర్ధుల గుండెల్లో గాభరా…!!

TDP Cadre Vows To Gift Chandragiri Seat To Chandrababu Naidu

తెలంగాణలో గెలుపు ఖాయమని ఫిక్సయిపోయిన టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటు విషయంలో ఇన్నిరోజులు కూటమిలో చర్చల మీద చర్చలు జరిగాయి. అయితే ఇప్పటికి సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. మహాకూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినందున టీడీపీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని నేతలు చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల కోసం ఆరుగురు సీనియర్లతో పార్టీ ఓ కమిటీ వేసింది. అభ్యర్థుల సమర్ధత, సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇప్పటికే ఓ జాబితా రూపొందించిన నేతలు ఆ వివరాలను చంద్రబాబు ఎదుట ఉంచారు.

chandrababu-naidu

తెలంగాణలో టీడీపీ సీట్ల కంటే గెలుపుకే ప్రాధాన్యత ఇవ్వనునందని తెలుస్తోంది. పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ, రేపటిలోగా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీ సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్‌ ట్రస్టు వేదికగా అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.ఇక మరోపక్క మహా కూటమి సీట్ల సర్దుబాటుతో తగ్గిన స్థానాలు, మరోవైపు టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. ఆశావహులకు ప్రత్యామ్నాయ పదవుల ఎరచూపి సంతృప్తి పరిచేందుకు ఎంపిక కమిటీ తీవ్ర స్థాయిలో కస్టాలు పడుతోంది. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న పలువురితో వార్‌ రూంలో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, శర్మిష్ఠ ముఖర్జీ తదితరులు మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. పోటీ నుండి తప్పుకుంటే పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ పదవులు ఇస్తామని నచ్చజెపుతున్నారు.

tdp-mahakutami

ఆశావహులు అధికంగా ఉండడంతో వారందరిని గాంధీభవన్ కు పిలిపించి ఎంపిక కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. మరోపక్క మహాకూటమితో పొత్తులో భాగంగా, తాము ఎంతగా దిగివచ్చినా, కాంగ్రెస్ ఇంకా మెలికలు పెడుతోందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మండిపడుతున్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మహాకూటమి ఏర్పాటు విషయంలో తాను ఎంతో చొరవ తీసుకున్నానని తెలిపారు. తాము 9 స్థానాలను అడిగామని, చివరకు 5 స్థానాలు ఇచ్చినా కూటమిలో కలిసుంటామని చెప్పామని కానీ కాంగ్రెస్ మాత్రం 3 ఎమ్మెల్యే స్థానాలను, 2 ఎమ్మెల్సీ స్థానాలను ఆఫర్ చేస్తోందని, దీనికి తాము అంగీకరించబోవడం లేదని చెప్పారు. చివరి ఆప్షన్ గా నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీని తాము కోరుతున్నామని, అందుకు కూడా అంగీకరించకుంటే, కూటమికి దూరం కావడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కూటమిని స్థిరంగా ఉంచాలన్నదే సీపీఐ అభిమతమని, అందుకోసం పలు ప్రతిపాదనలను సిద్ధం చేశామని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ పెద్దలేనని చాడ వ్యాఖ్యానించారు. దీపావళికి తేలుతుందన్న లెక్క నేటికీ తేలకపోవడంతో ఆశావహులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.