Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు హద్దులు దాటాయి. గుజరాత్ లో బీజేపీని ఓడించేందుకు పాకిస్థాన్ కాంగ్రెస్ కు సహాయం చేస్తోందని మోడీ చేసిన విమర్శలు సృష్టించిన సంచలనం మర్చిపోకముందే… కాంగ్రెస్ నేత ఒకరు పరిధులు దాటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువనేత, పఠాన్ జిల్లాలోని రాధన్ పూర్ నియోజకవర్గం అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ ఓ ప్రచార సభలో మాట్లాడుతూ మోడీపై అనుచిత విమర్శలు చేశారు. 35 సంవత్సరాల క్రితం మోడీ నల్లగా ఉండేవారని, ఇప్పుడు చాలా రంగు వచ్చారని అంటూ దీనికి ఓ విచిత్ర కారణం చెప్పారు. మోడీ రోజుకు రూ. 4లక్షల విలువైన ఐదు పుట్టగొడుగులను తైవాన్ నుంచి తెప్పించుకు తినడం వల్లే ఆయన అందంగా, ఆరోగ్యంగా తయారయ్యారని వ్యాఖ్యానించారు.
ఠాకూర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించారు. ఇది సాధారణమే. ప్రధానిపై వచ్చిన విమర్శలను సొంత పార్టీ వారు వ్యతిరేకించడం సహజమే. అయితే… ఓ తైవాన్ మహిళ కూడా ఠాకూర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెస్సీ జో అనే మహిళ ప్రధాని మోడీపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. తైవాన్ లో అటువంటి పుట్టగొడుగులు లేనే లేవని మెస్సీజో స్పష్టంచేసింది. తైవాన్ వాసినైన తాను ఇండియా నుంచి వచ్చిన ఓ వార్తను చదివానన్నిరుజ తైవాన్ లో ఒక్కో మష్రూమ్ 1200 డాలర్లకు లభిస్తుందని, అది తింటే చర్మం రంగు మారుతుందని భారత నేత ఒకరు వ్యాఖ్యానించారని, అది నిజం కాదని మెస్సీ జో వీడియోలో చెప్పారు. అలాంటి పుట్టగొడుగు తమ దేశంలో ఉన్నట్టు ఇంతవరకూ వినలేదన్నారు. అసలది అసాధ్యం అని కూడా తేల్చిచెప్పారు. ఈ వీడియో తర్వాత బీజేపీ నేతలు స్వరం పెంచారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రధాని భోజనంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు.