టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ ఎంపీలతో చేరికలు మొదలు పెట్టిన బీజేపీ వరుసగా నేతల్ని పార్టీలోకి లాగేస్తోంది. తెలుగు దేశం పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారితో పాటు ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలతో కాషాయదళం టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోపు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిశారని జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ మారడం ఖాయమని వార్తలు చక్కర్లు కొట్టాయి. పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలపై అనగాని సత్యప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు. తాను వ్యక్తిగత పనులుపై ఢిల్లీ వచ్చానని పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తానున ఏ బీజేపీ నేతని కలవలేదని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఆయన్ను కలిసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు నివాసంలో సమావేశం ఉందని తనకు సమాచారం అందిందని అనగాని చెప్పారు. రెండు రోజులు తాను ఢిల్లీ వెళుతున్నట్లు అధినేతకు సమాచారం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసనని అన్నారు. పార్టీ ఫిరాయిచిన రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్రావు తనకు ఆప్తుడని అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పరామర్శించడానికే ఢిల్లీ వెళ్ళానని అంతేగాని ఆయనతో కలిసి బీజేపీ నేతల్ని కలిశానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం కాదని అన్నారు. అయినా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదని.. తాను అలాంటి వ్యక్తిని కాదని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించలేదని.. ఏపీకి బీజేపీకి అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందన్నారు సత్య ప్రసాద్.