మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన టీడీపీ ఎంపీ !

Tdp MP Thota Narasimham To Join In YCP

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే నిన్న అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం లేదంటూ ప్రకటించిన నర్సింహం ఆయన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి కోరారు. కీలకమైన జగ్గంపేట టీడీపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుకి విన్నవించడం ద్వారా నర్సింహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. జగ్గం పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఇప్పటికే టీడీపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం ఉంది.

ఎందుకంటే జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు అనుకుంటూ ఉండగా ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది తెలిసి కూడా నర్సింహం టికెట్ అడగడం పార్టీని వీడుతున్నానంటూ చెప్పుకోవడానికి కారణం కోసమేననే వాదన ఉంది. జగ్గంపేట టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకి వెళ్లిపోవాలని తోట నర్సింహం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన కనీసం ఆ కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదని అందుకే ఆయన పోటీకి దూరంగా ఉండి టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ఊతం ఇచ్చేలాగా టికెట్ రాదన్న భయంతోనే కొందరు టీడీపీని వీడుతున్నారంటున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. పార్టీని వీడుతామని ఆరు నెలలుగా వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చివరికి టికెట్ దక్కదని తెలిసి పార్టీ మారారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మరో ఇద్దరు, ముగ్గురు నేతలు పార్టీని వీడే అవకాశముందన్నారు రాజప్ప. దీంతో ఇప్పుడు నరసింహం చేరిక మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.