Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుసగా నాలుగోరోజూ టీడీపీ ఎంపీలు లోక్ సభలో ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎదుట ఉన్న పుస్తకాలను లాగే ప్రయత్నంచేశారు. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది, అధికారులు శివప్రసాద్ ను అడ్డుకున్నారు. శివప్రసాద్ వైఖరిని స్పీకర్ సుమిత్రామహాజన్ తప్పుబట్టారు. ఈ ప్రవర్తన సరికాదని, సభను ఇలా అడ్డుకోవడం తగదని హితవుపలికారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. మిగిలిన టీడీపీ ఎంపీలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు చేసే నినాదాలు ఇతరసభ్యులకు ఇబ్బందిగా ఉంది. నిరసన తెలపండి కానీ… గట్టిగా నినాదాలు మాత్రం చేయొద్దు. దయచేసి మీరు మీ స్థానంలో కూర్చోండి. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోడానికి వెనుకాడను అని స్పీకర్ ఎంపీలను హెచ్చరించారు.
అయినప్పటికీ ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను కాసేపు వాయిదావేశారు. అంతకుముందు ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి న్యాయం చేసే విషయంలో టీడీపీ చేస్తోంది ధర్మపోరాటమనే విషయాన్ని కేంద్రానికి తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పెట్టారని ప్రధాని మోడీనే చెప్పినందున… దాని కోసమే మన పోరాటమన్న స్పష్టతతో ముందుకుసాగాలని ఆదేశించారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనట్టుగా ఉన్నందున పోరాటం కొనసాగించాల్సిందేనని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీలకు వివరించాలని ఎంపీలకు స్పష్టంచేశారు. ప్రధాని ప్రసంగంలో రాష్ట్రానికి ఉపయోగపడిందేమీ లేదని అభిప్రాయపడ్డారు. విభజనకు లేని ఫార్ములా… లోటు బడ్జెట్ భర్తీకి కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా 2-3 గంటలు చర్చ జరగాలని, హామీల అమలుపై విస్పష్ట ప్రకటన చేసేవరకు పోరాటం ఆపవద్దని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.