Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎంపీలు మూడురోజులుగా చేస్తున్న ఆందోళన ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. పార్లమెంట్ ఉభయసభల్లో ఎంపీల పోరాటం కేంద్రప్రభుత్వాన్ని అణువంతైనా కదిలించలేకపోయింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా విభజనహామీలపై ప్రధాని నరేంద్రమోడీ విస్పష్ట ప్రకటన చేస్తారని ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. మోడీ ప్రసంగం ఏపీ ప్రజలను మరోసారి తీవ్ర నిరాశానిస్పృహలకు గురిచేసింది. పోలవరం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, రైల్వే జోన్ ఇలా ఏ అంశాన్నీ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించకుండా విభజన నేరాన్ని కాంగ్రెస్ పై తోసేసి చేతులు దులుపుకున్నారు. గతరెండు రోజుల్లానే ఇవాళ కూడా లోక్ సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. ఆందోళన విరమించాలని స్పీకర్ పలుమార్లు కోరినప్పటికీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు.
టీడీపీ ఎంపీల నిరసనల మధ్యే ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని. పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న టీడీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తంచేసిన మోడీ ఈ వైఖరి పార్లమెంట్ కు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు ఈ పద్ధతిలో నిరసనలు తెలపడం ఎంతమాత్రమూ అంగీకరించబోమన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యులు అయిఉండీ ఇంతగా నినాదాలు చేయాల్సిన అవసరం ఏమిటో తనకు తెలియడంలేదన్నారు. సభాకార్యక్రమాలు ఎవరు అడ్డుకున్నా తప్పేనని, ఎవరినీ ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. అయినప్పటికీ టీడీపీ ఎంపీలు శాంతించలేదు. ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఆ నినాదాల మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన మోడీ ఏపీ సమస్యను ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విభజించిన తీరువల్లే ఏపీకి సమస్యలు వచ్చాయని ప్రధాని ఆరోపించారు. వాజ్ పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలూ రాలేదని, కాంగ్రెస్ ఒక్కరాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు పలికిందని మోడీ చెప్పారు. వాజ్ పేయి ప్రభుత్వం దీర్ఘదృష్టి వల్ల మూడు రాష్ట్రాలు విభజించినా… ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదని, ఎవరి వాటాలు ఆయా రాష్ట్రాలకు ఇచ్చారని, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగలేదని విమర్శించారు. రాజకీయ లబ్దికోసం పార్లమెంట్ తలుపులు మూసివేసి విభజన బిల్లును ఆమోదింపచేసుకున్నారని, నామమాత్రం ప్రతిపక్షం, ప్రసారమాధ్యమాలపై నియంత్రణతో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. అప్పుడు వారు చేసిన తప్పులవల్లే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు.
ఎన్టీఆర్ గురించి, టీడీపీ ఆవిర్భావ పరిస్థితుల గురించీ మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆనాడు రాజీవ్ గాంధీ దళిత ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారని, పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి పట్ల కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించిందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకే ఎన్టీఆర్ సినిమాలు వదలి రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించారని మోడీ గుర్తుచేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ మోడీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. అలాగే తన ప్రసంగాన్ని కొనసాగించిన మోడీ కాంగ్రెస్ పై మరిన్ని విమర్శలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ చేసిన అరాచకాలు అనేకమని, ఆ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మిగతా అంశాలపై మాట్లాడిన మోడీ విభజన హామీల అమలుపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రధాని తన ప్రసంగం ప్రారంభంలోనే ఏపీ అంశం ప్రస్తావించడంతో హామీల అమలుపై ప్రకటనచేస్తారన్న ఉద్దేశంతో టీడీపీ ఎంపీలు నిరసనలు ఆపేసి తమ స్థానాల్లో కూర్చున్నారు. కానీ ప్రధాని కాంగ్రెస్ పై విమర్శలతో సరిపుచ్చడంతో టీడీపీ ఎంపీలు తీవ్రంగా నిరాశ చెందారు.