ఎన్నికలకు ముందే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార పార్టీ టీడీపీ.. ప్రతిపక్షం వైసీపీ మధ్య మాటల యుద్ధం, పోరు ముదురుతోంది. ఎన్నికల్లో తమకు సహకరించాలంటూ నియోజకవర్గంలోని పోలీసులకు వైసీపీ నేత డబ్బులు ఇవ్వజూపారనే వార్తలు నిన్న మీడియాలో కలకలం రేపాయి. దీనిపై మైలవరం పోలీసులు కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అధికార పార్టీ, మంత్రి దేవినేని ఉమా ఒత్తిడితో ఉద్దేశపూర్వకంగా తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పోలీసుల తీరును నిరసిస్తూ.. మైలవరం పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరులు, వైసీపీ కార్యకర్తలతో ధర్నాకు దిగారు.
తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. డబ్బు ఇస్తున్నట్లు తమ దగ్గర సీసీ ఫుటేజీ ఉందంటున్న పోలీసులు ఆ వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసుల్ని వెంటనే ఉపసంహరించుకొని మైలవరం సీఐ, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క టీడీపీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలకు సర్థిచెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై వసంత కృష్ణ ప్రసాద్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారని సమాచారం.