ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. 2018 జూన్‌లో ఆమెకు తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేశారు. కానీ, ఆమె నాలుగు నెలలు తిరిగే సరికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది తెలిసిన పాఠశాల హెడ్ మాస్టర్ సహా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆమెను స్కూల్ నుంచి వెలివేశారు. దీంతో ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసింది. చైల్డ్ రైట్స్ కమిషన్‌లోనూ తన గోడు వెల్లబోసుకుంది. అధికారులు ఆమె ఫిర్యాదుతో జిల్లా విద్యాధికారులకు సమన్లు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణ అనంతరం ఆమెను పాఠశాలకు వెళ్లేందుకు ఎవరూ అడ్డుకోరాదని చెబుతూ విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అయితే, ఆ ఆదేశాలను పాఠశాల ఉపాధ్యాయులు ఖాతరు చేయలేదు. ఆమెను పాఠశాలలోకి రానివ్వలేదు. దీంతో ఆ టీచర్ ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలోని కొట్టంకల్‌లో మహిళ(33).. ఐదేళ్లుగా ఉపాధ్యాయులిగా పనిచేస్తోంది. అంతకుముందే పెళ్లైన ఆమె, వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. అయితే, ఆ విడాకులు మంజూరు కావడానికి సమయం పట్టింది. ఆ లోగా మరో వ్యక్తితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. అయితే, విడాకులు మంజూరయ్యేవరకు ఆమె పెళ్లి చేసుకోవడానికి వేచిచూడాల్సి వచ్చింది. దీంతో రెండో భర్తతో పెళ్లికి ముందే లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ కొనసాగించింది. పెళ్లైన నాలుగు నెలలకు ఆమె మెటర్నిటీ లీవ్ కోసం దరఖాస్తు చేసుకొని వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. అదే ఆమెకు శాపంగా మారింది.