తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా రేగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు ఇచ్చేందుకు మంత్రులందరినీ ప్రగతి భవన్ లోనే వదిలి కేసీఆర్ ఒక్కరే రాజ్ భవన్ చేరుకున్నారు.
గవర్నర్ నరసింహన్ ను కలసి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా కోరతారు. అనంతరం గన్ పార్కుకు వెళ్లి, అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లి, మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియాతో కేసీఆర్ మాట్లాడతారు. అక్కడే ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా కేసీఆర్ వెల్లడించనున్నారు. ప్రభుత్వ రద్దుకు సంబంధించి ప్రకటన చేసిన అనంతరం సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకోనున్నారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్లి అక్కడి నుండే ప్రచారం మొదలుపెట్టనున్నారు.