తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నది విదితమే. ఇప్పటికే ఎన్నికలు మరియు వాటి ఫలితాలను వెల్లడించే తేదీలను ప్రకటించిన ఎన్నికల శాఖ తాజగా అభ్యర్థుల నామిషన్లను స్వీకరించటానికి సిద్ధమైంది. తెలంగాణ శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విడుదల చేసింది. మరి కొద్దిసేపటిలో అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్‌ను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 7న జరగనున్న పోలింగ్ కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే ఈరోజు నుండి అభ్యర్థులు నామినేషన్లు ప్రక్రియ మొదలు కానుంది అంటే నేటి నుండి అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.
మొత్తం 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి ఉదయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు సాగుతుంది. 20న నామినేషన్ల పరిశీలన, అలాగే 21, 22 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక అలాగే 23 వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థుల ప్రచారానికి గడువు ఉంటుంది. గత నెల 22, 23, 24 తేదీల్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ నేతృత్వంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించింది. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలతో సమావేశమై ఎన్నికల నిర్వహణను సమీక్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలు శాఖల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ఓటర్ల జాబితాలో తప్పులు, సవరణలపై కసరత్తు వేగవంతం చేశారు. ఈసారి వికలాంగులు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే తోలి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ముషీరాబాద్‌లోని విజయగణపతి ఆలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా ఎంఆర్‌ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేస్తారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా, ఎంపీ దత్తాత్రేయ, తాజా మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు హాజరవుతారట. తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉదయం 11 గంటలకు ధూల్‌పేటలోని ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయంలో బీఫాం తీసుకున్న అనంతరం ఆబిడ్స్‌లోని మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని రాజాసింగ్ నామినేషన్ సమర్పిస్తారు