Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సిద్ధిపేట తనకు అన్నీ ఇచ్చిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సిద్ధిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్… అనంతరం ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఉనికి కోసం, నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. సిద్ధిపేట తెలంగాణకు గుండెకాయ లాంటిదని, తనకు జన్మనిచ్చింది, రాజకీయ జీవితాన్ని కల్పించింది ఈ ప్రాంతమే నన్నారు. జన్మభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, సిద్ధిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో సిద్ధిపేట వాసుల కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఆయన ఓసారి గుర్తుచేసుకున్నారు.
పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లిందని, తన కళ్లముందే రాష్ట్రపతి ఆ ఫైలుపై సంతకం చేసి, తన జన్మ ధన్యమయిందని ఆశీర్వదించి, తనను ప్రశంసించారని కేసీఆర్ బహిరంగ సభలో తెలిపారు. తెలంగాణ తరహాలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. తనకు బలమిచ్చింది, పోరాటాన్ని నేర్పింది సిద్ధిపేటేనన్నారు. అంతకుముందు సిద్ధిపేటకు వస్తూ కేసీఆర్ మార్గమధ్యంలో బాల్యమిత్రుల కోసం కాన్వాయ్ ను ఆపి వారిని తన వాహనంలో ఎక్కించుకున్నారు. కేసీఆర్ సిద్ధిపేట వెళ్తుండగా.. ములుగు వద్ద జాతీయ రహదారిపై ఆయన మిత్రులు జహంగీర్, అంజిరెడ్డి కనిపించారు. వెంటనే కాన్వాయ్ ను ఆపిన సీఎం వాహనం దిగి వారిద్దరినీ పలకరించారు. అనంతరం సిద్ధిపేట పర్యటనకు వారిని తన వాహనంలో తీసుకెళ్లారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా చేయడంతో ఆయన మిత్రులుతో పాటు స్థానికులు, అధికారులు ఆశ్యర్యంలో మునిగితేలారు.