నేడు ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ గురించి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తెలంగాణ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున, అది తేలేవరకూ ఎన్నికలు జరిపించరాదని ఈసీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ లోగా నాలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వున్న నేపథ్యంలో, వాటికి మాత్రమే షెడ్యూల్ విడుదల కానుంది. హైకోర్టులో కేసు తేలిన తరువాత తెలంగాణకు షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తోంది.