తెలంగాణా ప్రభుత్వం మందుబాబులకి శుభవార్త చెప్పింది. అదేంటంటే జీహెచ్‌ఎంసీతోపాటు 5 కి.మీ. పరిధిలోని బార్లలో శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అయితే ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకే మద్యం అమ్మకాలకి అనుమతి ఉంది. ఇప్పుడు మరో గంట పెంచి అమ్ముకునేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 400 వరకు పబ్బులు, బార్లు ఉన్నాయి. రోజుకి లక్ష లీటర్ల హార్డ్ సరుకు , 5 లక్షల లీటర్ల సాఫ్ట్ సరుకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమ్మకాలు పెరగొచ్చని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. దేశంలోని మెట్రో నగరాల్లో అమ్మకాలను పరిశీలించి వారంలో 2 రోజులు గంటపాటు అదనంగా అమ్మాలని ప్రభుత్వం ఒక అంచనాకి వచ్చిందని తెలుస్తోంది.