వంద సీట్లకు పైగా గెలిచి మళ్ళీ అధికారం సాధించాలన్న ఆశతో అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తుకు సిద్దమైన తెరాస పరిస్థితి ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ అన్నట్టుగా తయారైంది. అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి తెరాసకు అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. మహాకూటమితో కాంగ్రెస్ బలపడటం టిక్కెట్ల విషయంలో తెరాసలో అసంతృప్తి సెగలు ప్రచారానికి వెళ్లిన తెరాస నేతలకు నిరసన సెగలు ఇలా ఒకటేమిటి పరిస్థితులు అన్నీ తెరాస ను పగబట్టాయి. కేసీఆర్ కు ఈ తలనొప్పులు చాలవన్నట్టు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చింది. చివరకు తెలంగాణ ఐఎఎస్‌లు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిపాలనపై ధ్వజమెత్తు తున్నారు.
ఆయన తమపై వివక్ష చూపిస్తున్నారని తెలంగాణకు చెందిన కొంత మంది ఐఎఎస్ అధికారులు నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ధ్వజమేట్టినట్టు కొన్ని సెలక్ట్డ్ మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఎస్సీ,ఎస్టీ,బిసిలకు చెందిన ఐఎఎస్ అధికారులు తమను పనికిరాని పోస్టుల్లో నియమించారని, గుమస్తాలు లాగా పనిచేయించుకున్నారని దాదాపు 20మంది తెలంగాణకు చెందిన ఐఎఎస్ అధికారులకు పనికిమాలిన పోస్టులు ఇచ్చారని ధ్వజమెత్తారని ఆ వార్త సారంశం. మెజార్టీ తెలంగాణ ఐఎఎస్ అధికారులకు దక్కాల్సిన పోస్టులు దక్కలేదని వారి స్థానంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారులను నియమించుకున్నారని వారంతా ఓసీ కులాలకు చెందిన వారేనని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ, అధికారులను సచివాలయంలో గుమస్తా లాంటి పోస్టులో ఏళ్ల తరబడి ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని ఆ కధనం చెప్పుకొచ్చింది. గత నాలుగేళ్లు తెలంగాణ స్థానిక ఐఎఎస్ అధికారులకు మంచి పోస్టులు ఇవ్వలేదని కానీ హార్టీకల్చర్ కమీషనర్ ‘వెంకట్రామిరెడ్డి’కి ఏడు పోస్టులు ఇచ్చారని పైగా ఆయన సర్వీసు నుంచి రిటైర్ అయినా ఇన్ని పోస్టులు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ‘గోపాలరావు’ 12సంవత్సరాల క్రితం ఇంజనీర్‌గా రిటైర్ అయినా సిఎండి/ఎస్‌పిసిడిఎల్, వరంగల్ పోస్టు ఇచ్చారని, పరిశ్రమల కార్పొరేషన్ ఎండిగా నరసింహారెడ్డిని నియమించారని, ఉన్నత కులాలకు చెందిన వారికే మంచి పోస్టులు కట్టబెట్టారని వారు ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు చెందిన ఐఎఎస్ అధికారులనే ఇబ్బందులు పెట్టిందని తమకే దిక్కులేకపోతే సామాన్య ప్రజలకు దిక్కేముంటుందని వారు ఈ సందర్భంగా ప్రశ్నించినట్టుగా సదరు కధనం పేర్కొంది. అయితే రాష్ట్రంలోని స్థానిక ఐఏఎస్‌లు అసంతృప్తితో ఉన్నట్టు కొన్ని మీడియాల్లో మాత్రమే వచ్చిన వార్తల వెనుక గతంలో ఐఏఎస్‌గా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారిన ఓ నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఎస్సీ, ఎస్టీ వ్యవహారాలు చూస్తున్న ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడు.
ఆయన శిష్యుడు ప్రమోటీ ఐఏఎస్ మురళి హస్తం కూడా ఈ మీటింగ్ వెనుక ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిరువురూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంతనాలు చేస్తున్నట్టు, ఢిల్లీలోని మేఘాలయ భవన్‌లో అనేకసార్లు సమావేశమైనట్టు ప్రభుత్వానికి చాలా కాలం కిందటే సమాచారం అందింది. కాంగ్రెస్ లో ఎస్సీ, ఎస్టీ వ్యవహారాలు చూస్తున్న ఆయన రాష్ట్రంలో చాలామంది దళిత ఐఏఎస్‌లు, కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు గాడ్ ఫాదర్‌గా ఉన్నారని ఆ వర్గాల్లో టాక్. ఎస్సీ, ఎస్టీ అధికారుల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి అప్రాధాన్య పోస్టింగులు, ప్రభుత్వ విధానాలతో ప్రజలకు కలిగే కష్టాల గురించి ఆయనకు వీరు ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ ఇస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహించిన ఆ నేతకు పలువురు ఐఏఎస్‌లతో బంధుత్వాలు ఉన్న కారణంగా ఆయన వారితో టచ్‌లో ఉంటున్నారు. సదరు నేతతో బంధుత్వాలు ఉన్నవారే అసంతృప్త సివిల్ సర్వెంట్ల సమావేశాలను ప్రోత్సహిస్తున్నారని అధికారపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఈ క్రమంలో నెల కిందట ఎస్సీ, ఎస్టీ, బీసీ సివిల్ సర్వెంట్ల సమావేశం జరిగింది. తాజాగా ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్న ఓ ఐఏఎస్ అధికారికి ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం పలువురు ఐఏఎస్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ప్రభుత్వం మీద తమ అసంతృప్తిని వెళ్ళగక్కినట్టు వార్తలు వచ్చాయి.