Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అటు సూర్యుడు ఇటు పొడిచినా కాదేమో అనుకున్నది అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లో ఐటీ రంగ క్రెడిట్ ఇవ్వడానికి తెలంగాణ మంత్రి , ముఖ్యమంత్రి కుమారుడు కె. తారకరామారావు ముందుకొచ్చారు. బాబు తో పోల్చుకుంటే తాను చేసింది చాలా తక్కువని KTR ఒప్పుకున్నారు. 17 ఏళ్ల కిందటే మైక్రోసాఫ్ట్ ని ఒప్పించి ఇక్కడ కార్యాలయం పెట్టించడం వల్లే మిగిలిన అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఇక్కడకు వచ్చాయని కేటీఆర్ బహిరంగంగా చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్నప్పుడు ఇది నిజమేనా అన్న డౌట్ వచ్చింది. కేటీఆర్ ఈ మాటలు చెప్పింది ఓ ఐటీ కంపెనీ వేదిక మీద కావడం, అక్కడంతా అదే రంగానికి చెందినవాళ్లు కావడంతో రాజకీయాలు మర్చిపోయి ఇలా వ్యవహరించారు అన్న సందేహాలు కూడా కొందరికి వచ్చాయి. కానీ కేటీఆర్ ఏమీ అంత అమాయకుడు కాదు. ఇదే మాట ఏ రాజకీయ వేదిక మీద వాడితే తెలంగాణాలో ఏ రియాక్షన్ వస్తుందో ఆయనకు తెలుసు. అందుకే ఎక్కడ ఈ మాట చెబితే ఎవరికి చెబుతుందో తెలిసి మరీ మాట్లాడారు. అంతకుముందు ABN రాధాకృష్ణ చెప్పినట్టు వెల్ కం గ్రూప్ కి పునాది వేశారు కేటీఆర్.
జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాజకీయంగా రెడ్ల ఆధిపత్యాన్ని నిలువరించడానికి వెలమ , కమ్మ కాంబినేషన్ రాజకీయాలు చేసేవారని ప్రచారం. అయితే మారిన రాజకీయ పరిస్థితులతో పాటు సీన్ అంతా మారిపోయింది. ఎన్టీఆర్ తెలుగుదేశం ఏర్పాటుతో అంతకుముందు రాజకీయ ప్రయాణంలో పాసెంజర్ సీట్ కే పరిమితం అయిన కమ్మలు డ్రైవింగ్ సీట్ లోకి వచ్చారు. ఇక తెలంగాణ లో టీడీపీ ఎత్తుకున్న బీసీ నినాదం , తెరాస ఏర్పాటుతో వెలమలు , కమ్ముల మధ్య అంతరం పెరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ రెండు వర్గాల మధ్య గ్యాప్ ఇంకా పెరిగింది. కానీ ఆశ్చర్యకరంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత రెడ్లంతా కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతున్న విషయాన్ని గమనించిన కెసిఆర్ అప్పట్లో వెంగళరావు అమలు చేసిన వెల్ కం గ్రూప్ ప్లాన్ అమలుకు సిద్ధం అయ్యారు.
హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సెటిల్ అయిన కమ్మలని ఆకట్టుకోడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా రెడ్లంతా ఒక వైపుకు చేరడానికి కౌంటర్ గా కమ్మలని చేరదీస్తున్నారు కెసిఆర్. ఇక రాజకీయంగా , ఆర్ధికంగా , వాణిజ్యపరంగా హైదరాబాద్ లో ప్రబలశక్తిగా వున్న కమ్మలను దూరం పెడితే జరిగే నష్టాన్ని అంచనా వేసుకున్న కెసిఆర్ చేసిన ప్లాన్ లో భాగంగానే కేటీఆర్ తాజా కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. అటు ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాలపై చేస్తున్న దండయాత్ర ని తట్టుకోడానికి కూడా ఇద్దరు చంద్రులకి ఒకరితో ఒకరికి అవసరం పడేట్టు వుంది. ఇవన్నీ ఆలోచించుకునే చంద్రబాబు మీద కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కమ్మలకి వెల్ కం పలికారు.