తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఒక పక్క టీఆరెస్ అన్హ్యరుదులని ఎప్పుడో ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నా మరో పక్క కూటమి కట్టిన నేతలు మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కూటమి సంగతి పక్కన పెడితే ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ లోనే చీలిక ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఇటీవల కెసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం చూస్తుంటే హరీష్ రావును పక్కనపెట్టాశారన్నది స్పష్టం అవుతూనే ఉంది. ఈ క్రమంలో తన తనయుడు కేటీఆర్ ను సీఎంగా కూర్చోపెట్టాలన్న తపనతోనే హరీష్ ను దూరం చేస్తున్నారన్న విమర్శలకు కూడా గట్టిబలం సమకూరుతుంది.
అయితే ఇదంతా ఊహిస్తున్న ఊహ అనుకుంటే మరి నేడు గజ్వేల్ నియోజవర్గ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో వేడిని పుట్టిస్తున్నాయి. అవేంటంటే…. టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు తారా స్థాయికి చేరిందని టిఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకే మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అతి త్వరలోనే హరీష్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని చెప్పారు. 50 రోజుల్లో వంద సభలు పెడతానని బీరాలు పలికిన కేసిఆర్ ఫామ్ హౌస్ కే ఎందుకు పరిమితమయ్యారో చెప్పాలని సవాల్ చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని వంటేరు ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ లో బావ, బామ్మర్దిల (హరీష్ రావు, కేటిఆర్) మధ్య కొట్లాట సీరియస్ గా నడుస్తున్నది అని తెలిపారు వంటేరు. హరీష్ రావుకు టిఆర్ఎస్ లో గౌరవం లేదు కాబట్టి అతి త్వరలో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అని తెలిపారు.
ఇది ముమ్మాటికీ వాస్తవం అన్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ సమక్షంలో హరీస్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు చెప్పారు. అయితే ఈ వాదన ఇప్పటిది కాదు చాలా రోజుల నుండీ ఉంది. హారీష్ రావు మంచి నేత అని, ఆయన కాంగ్రెస్ లోకి వస్తే చాలా బాగుంటుందని ఇంతకు ముందు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. హరీష్ రావు కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే టీఆర్ఎస్ సగబలం తగ్గిపోతుందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తారాస్థాయిలో బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఆ మధ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఓ రోజు జానారెడ్డిగారు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తున్నారు. చిట్ చాట్ ముగింపు సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. 2019 లో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఓ బాహుబలి వస్తాడని చెప్పారు. అంతే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది మీడియా ప్రతినిధులలో ఉత్కంఠ రేగింది. ఎవరు సార్ ఆ బాహుబలి అని సందేహ నివృత్తి కి ప్రయత్నించారు. యథాలాపంగా ఆ పైవాడు అంటూ జానారెడ్డి పైకి చేయి చూపించారు. పై వాడంటే హరీష్ అనుకునేరు (అసెంబ్లీలో సీఎల్పీ కార్యాలయం పైనే టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ఉంటుంది.
జానా ఈ వ్యాఖ్య చేసిన సమయంలో కాకతాళీయంగా ఆ కార్యాలయంలో హరీష్ ఉన్నారు). ఆ తర్వాత తన ఉద్దేశం దేవుడు అని జానా సవరణ చేశారు. సీన్ కట్ చేస్తే నెలన్నర తర్వాత అదే హరీష్ కాంగ్రెస్ లోకి వస్తారని జోరుగా చర్చ మొదలైంది. టీఆర్ఎస్ లో రోజు రోజుకు మారుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఆ రోజు జానారెడ్డి బాహుబలి గురించి సరదాగా ఏం చెప్పలేదు…హరీష్ ను దృష్టిలో పెట్టుకునే ఆ కామెంట్స్ చేశారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.