Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారందరికీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన రేవంత్ రెడ్డి బాటలో తెలంగాణ టీడీపీకి చెందిన మరో కీలక నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడయిన ప్రతాప్ రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీచేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కు ఆయన గట్టిపోటీ ఇచ్చారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసిన నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు కేసీఆర్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు.
ఈ నేపథ్యంలో గజ్వేల్ లో మంచి నాయకుడి కోసం వెతుకుతున్న కాంగ్రెస్ వంటేరుపై దృష్టిపెట్టింది. టీఆర్ ఎస్ ను గట్టిగా వ్యతిరేకించే వంటేరుతో గజ్వేల్ లో పార్టీ బలోపేతమవుతుందన్నది కాంగ్రెస్ ఆలోచన. వంటేరు కొన్నిరోజుల నుంచి టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్టీఆర్ భవన్ కు కూడా రావడం లేదు. కాంగ్రెస్ ఆహ్వానంపై చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఆయన తుదినిర్ణయం తీసుకోనున్నారు.