TG Politics: ఈరోజు రాజేంద్రనగర్‌లో శంకుస్థాపన చేయనున్న నూతన హైకోర్టు భవన నిర్మాణం

TG Politics: The foundation stone of the new High Court building will be laid in Rajendranagar today
TG Politics: The foundation stone of the new High Court building will be laid in Rajendranagar today

తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలోంచి 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భూములను కేటాయిస్తూ గతేడాది డిసెంబరు 31వ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు.

పాతబస్తీలోని ప్రస్తుత భవనంలో 104 ఏళ్లుగా హైకోర్టు కొనసాగుతోంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ప్రస్తుత భవనంలో 2009లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పటి నుంచే కొత్త భవనం నిర్మాణం కోసం చర్చ, ప్రతిపాదనలు మొదలయ్యాయి. పెరిగిన జడ్జిలకు అనుగుణంగా పార్కింగ్, భవనం సరిపోకపోవడం, తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొత్త భవనం నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, న్యాయవాదులు, న్యాయమూర్తులు హాజరు కానున్నారు.