వచ్చే ఎన్నికల్లో సీఎం కావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వైసీపీలో నేతల మధ్య విబేధాలు ఆయనకు పెద్ద తలనోప్పిగా మారాయి. జగన్ పాదయాత్ర సాక్షిగా వైసీపీలో వర్గ విబేధాలు తేటతెల్లమవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ముగ్గురు కన్వీనర్లని నియమించడంతో ఇప్పుడు వారి మధ్య విబేధాలు పార్టీ అధిష్టానానికి పెద్ద సమస్యగా మారాయి.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న జగన్ పాదయాత్రలో వైసీపీలో వర్గపోరు తారాస్ధాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు పంతం నెగ్గించుకునేందుకు పోటీ పడుతుండటంతో జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు మరింత ముదిరి కొట్లాటకి దారి తీసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న జగన్, సోమవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ కు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం. మురళీకృష్ణంరాజు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి జగన్ కు స్వాగతం పలికారు. తన డామినేషన్ చూపిస్తూ మురళీ అనుసరించిన తీరు ప్రసాద్ వర్గానికి ఇది నచ్చలేదు.
దీనికి తోడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మురళీకృష్ణంరాజు తన అనుచరులతో జెండాలు చేతబూని జగన్ ముందు సందడి చేశారు. మురళీకృష్ణంరాజు తీరుతో అగ్రహం కట్టలు తెంచుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పూర్ణచంద్రప్రసాద్ వారి వద్ద ఉన్న పార్టీ జెండాలను తీసుకుని విసిరివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నడిచి అది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా దీనిని ప్రశ్నించిన మురళీకృష్ణంరాజు మేనల్లుడు అచ్యుత్కుమార్రాజుపై , ప్రసాద్ చేయి చేసుకున్నారు. దీంతో జగన్ పాదయాత్ర సాగుతుండగానే ఇలా ఇరు వర్గాలు కొట్టుకోవడం ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారింది.