Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘మహానటి’. భారీ అంచనాల నడుమ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అదే సమయంలో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. చరణ్ మూవీతో పోటీ వద్దనుకున్న ‘మహానటి’ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల తేదీని మార్చే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. చిత్ర విడుదల వాయిదా వేయడంను పలువురు సినీ ప్రముఖులు స్వాగతించారు. చరణ్‌తో పోటీ వద్దనుకోవడం మంచి నిర్ణయమని భావించారు. అయితే మహానటి నిర్మాత మాత్రం సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.
‘మహానటి’ చిత్రం విడుదల తేదీని మార్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు తాము విడుదల తేదీ మార్పుకు ఆలోచన చేయడం లేదని, ఆరు నూరైనా కూడా సినిమాను అనుకున్న డేట్‌కు అంటే మార్చి 30న విడుదల చేసి తీరుతాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ముందు నుండి అనుకున్నట్లుగా ‘మహానటి’ విడుదల తేదీ ఉంటుందని, మార్పు లేదని తేల్చి చెప్పారు.
రంగస్థలం చిత్రంతో పాటు కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎమ్మెల్యే’ చిత్రం కూడా అదే సమయంలో విడుదల కాబోతుంది. మార్చి చివరి వారం అంటే అన్ సీజన్‌గా పరిగణిస్తారు. అలాంటి అన్ సీజన్లో మూడు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం అంటే సాహస నిర్ణయం అని చెప్పుకోవాలి. మహానటి విడుదల అదే రోజు ఉంటే కలెక్షన్స్ పరంగా ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందుకే ఇప్పటికైనా మహానటి విడుదల తేదీని మార్చుకోవడం ఉత్తమం అంటూ సినీ విశ్లేషకులు చిత్ర యూనిట్ సభ్యులకు సలహా ఇస్తున్నారు.