ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ చివరికి ఆమె కుమార్తెపైనే కన్నేశాడు. కుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయాలనీ, ఇద్దరిని బాగా చూసుకుంటానని చెప్పాడు. దీనికి బిత్తరపోయిన సదరు మహిళ నిరాకరించడంతో వేధింపులు మొదలుపెట్టాడు. ఆ వేధింపులు హద్దులు దాటడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది. తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మేల్ పుదుపేటై ఆలయ భజన వీధిలో కల్పన (36) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. భర్తతో గొడవల నేపథ్యంలో ఆమె ప్రస్తుతం విడిగా ఉంటోంది. దీంతో స్థానికంగా పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కుమరేశన్ తో ఆమెకి అక్రమ సంబంధం ఏర్పడింది. అతను తరచూ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇటీవల పెద్ద కుమార్తెకు 18 ఏళ్లు రావడంతో ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని కుమరేశన్ కల్పనను కోరాడు.
అయితే దీన్ని వ్యతిరేకించిన ఆమె మరోసారి ఆ విషయం మాట్లడవవద్దని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇంటికి రావొద్దని హెచ్చరించింది. దీంతో కుమరేశన్ కల్పనను వేధించడం ప్రారంభించాడు. చివరికి ఈ వేధింపులు హద్దులు దాటడంతో కల్పన ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుమార్తె ఇచ్చిన సమాచారంలో ఇంటికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. తన తల్లిని కుమరేశనే హత్య చేశాడని కుమార్తె ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.