Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల ప్రభావంపై కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచాయన్న అంచనాలు తప్పని తేలుతోంది. ఇప్పటికే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే విజయం వరించనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చగా… సాధారణ ఎన్నికల్లోనూ ఆ ఫలితమే వస్తుందని ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఇప్పటికీ ప్రధాని మోడీనే అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా ఉన్నారని ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ గ్రూప్ నిర్వహించిన మెగా ఆన్ లైన్ సర్వేలో వెల్లడయింది. సార్వత్రిక ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే ఎవరికి ఓటేస్తారు అని అడిగిన ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారిలో 79శాతం మంది మోడీ వైపు మొగ్గుచూపారు.
రాహుల్ కు కేవలం 20శాతం మందే అనుకూలంగా ఉన్నారు. కొత్త సారధి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం కానుందా అని అడిగిన ప్రశ్నకు 73శాతం మంది కాదని సమాధానమివ్వగా..21శాతం అవునని బదులిచ్చారు. ఓటర్లతో అనుసంధానమయ్యే సామర్థ్యం రాహుల్ కు లేదని 55శాతం మంది, ఉందని 34శాతంమంది, చెప్పలేమని 11శాతం మంది సమాధానమిచ్చారు. 2019లో మోడీ నేతృత్వంలోని సర్కారే మళ్లీ రానుందని 79శాతం మంది అభిప్రాయపడగా, రాహుల్ సారథ్యంలోని ప్రభుత్వం వస్తుందని 16శాతం, తృతీయ ప్రత్యామ్నాయం అని 5శాతం బదులిచ్చారు. టైమ్స్ గ్రూప్ ఈ నెల 12 నుంచి 15 తేదీల మధ్య 72గంటల పాటు మూడు భాగాలుగా నిర్వహించిన సర్వేలో 5లక్షల మంది పాల్గొన్నారు. మొత్తానికి మోడీ చరిష్మా తగ్గిందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఈ సర్వేలో వెల్లడయింది.