తెలంగాణాలో జరుగుతున్న ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వం శీతాకాలంలో కూడా వేడిని రాజేస్తోంది. తెరాస పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి, వాడి వేడిగా ప్రచారాలను నిర్వహించేందుకు తెరాస నేతలను, కార్యకర్తలను కదనరంగంలోకి దింపగా, వారికి అడుగడుగునా ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే. గడిచిన నాలుగున్నర ఏండ్లలో నియోజకవర్గంలోని గ్రామాలకు ఏమి చేశావో చెప్పు అని నిలదీస్తూ, గ్రామాల్లోకి రానీయకుండా తెరాస నేతలను నిలువరిస్తుండగా, నిన్ను గెలిపిస్తే ఏమేమి చేస్తావో బాండ్ పేపర్ మీద రాసివ్వు ఓట్లు గుద్దుతాం అని నిలదీసి అడుగుతున్న ప్రజలకు ఏమి చెప్పాలో తెలియని సందిగ్ధంలో వెనుతిరుగుతున్న తెరాస కార్యకర్తల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో మహాకూటమికి ప్రజల్లో ఆదరణ రోజురోజుకి పెరుగుతుండడం అందరూ గమనిస్తున్న విషయమే.
ఒకవైపు తెరాస అధ్యక్షుడు, మాజీ సీఎం కెసిఆర్ ప్రచారంలో మహాకూటమి ని నిందించడమే పనిగా పెట్టుకొని, చప్పగా ప్రసంగం చేస్తుండడంతో పాటు, ఈసారి అధికారంలోకి వస్తే సచివాలయం నుండే పాలన సాగిస్తానని అంటున్న మాటలు కూడా తీవ్ర వ్యతిరేకతని మూటగట్టుకుంటున్నాయి. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పాలన అంతా 300 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రగతి భవన్ నుండి, ఫామ్ హౌస్ నుండి చేస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు కూడా ఈ విషయం లేవనెత్తుతుండడంతో రాబోయే ఎన్నికల్లో గెలిస్తే సచివాలయం లో అందరికి అందుబాటులో ఉంటాననడం కడు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ప్రచారాల్లో తాను లేవనెత్తుతున్న రైతు బంధు, డబల్ బెడ్ రూమ్ ఇల్లు విషయం కూడా పొలాన్ని సాగు చేస్తున్న కౌలు రైతులకు ఫలమివ్వలేని రైతు బంధు గా, మూడెకరాలున్న బడుగు రైతుకి అంతగా ఉపయోగపడని ఈ పథకం పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్న ఆసామికి బంగారు బాతు లా ఉండడం, తెరాస కార్యకర్తలకే డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని, కొందరికి ఇచ్చిన ఆ ఇళ్ళు నాసిరకమైనవని, గట్టిగా వాన వస్తే చాలు పూర్తిగా నేలమట్టం అవుతాయని విమర్శలు రావడంతో కెసిఆర్ పథకాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా అభివర్ణిస్తున్నారు ప్రతిపక్షాల పార్టీల వారు, రాజకీయజ్ఞానం తెలిసిన ప్రజలు.
తాజాగా టైమ్స్ నౌ అనే ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఓటర్ల సర్వేలో తెరాస పార్టీ ఘనవిజయం సాధించడమే కాకుండా, గత ఎన్నికలతో పోలిస్తే మరిన్ని సీట్లని సాధించి, అత్యధిక మెజారిటీతో తెరాస అభ్యర్థులు గెలుస్తారని, కెసిఆర్ మళ్ళీ తెలంగాణ పీఠం అధిరోహిస్తారని చెపుతుంది. ఈ సర్వే ప్రకారం తెరాస 70 స్థానాలు, కాంగ్రెస్ 30 స్థానాలు, టీడీపీ 2 స్థానాలు, ఎమ్‌ఐఎమ్ 8 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, ఇతరులు 5 స్థానాలు సాధిస్తారని వెల్లడవుతుంది. ఇదిలాఉండగా, సోనియా గాంధీ నిన్న మేడ్చల్ లో హాజరై, ప్రసంగించిన సభకి అశేష ప్రజానీకం తరలిరావడంతో మహాకూటమి శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది.