2019లో ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనుండగా వీటిలో రెండు సంపూర్ణ సూర్య గ్రహణాలు, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. కొత్త ఏడాది ప్రారంభమైన తొలివారంలోనే సూర్యగ్రహణం సంభవించింది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడింది. జనవరి 6 పాక్షిక సూర్యగ్రహం, జనవరి 21న సంపూర్ణ చంద్రగహణం ఏర్పడ్డాయి. ఇది ఆసియా, ఫసిఫిక్ తీరం, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కనిపించింది. ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం జులై 16 అర్ధరాత్రి దాటిన తర్వాత 1.31 గంటలకు సంభవించనుంది. ఇది తెల్లవారుజాము 4.29 గంటల వరకు ఉంటుంది. దీంతో తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని జులై 16న రాత్రి 7 నుంచి మర్నాడు అంటే 17 తెల్లవారుజామున 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించి, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది. జులై 17 బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుంచి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు ఆలయం మూసివేయడం ఆనవాయితీ. జులై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.