Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెర మీదకి వచ్చింది. ఈకేసులో సిట్ ఛార్జ్‌షీట్‌ను అధికారులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ బృందం 10 మంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. ఛార్జ్‌షీట్‌లో టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడు ఇద్దరు హీరోల పేర్లు చేర్చారని సమాచారం. ఎఫ్ఎస్ఎల్కు ముగ్గురు శాంపిల్స్ పంపగా ఇందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరికి సంబంధించిన ల్యాబ్ నివేదిక కోర్టుకు కూడా చేరింది. ఈ కేసు విచారణలో వెల్లడైన విషయాలతో పాటు ఫోరెన్సిక్ పరీక్షల్లో ముగ్గురి శాంపిల్స్ డ్రగ్స్ నమూనాలతో సరిపోవడంతో వీరి పేర్లను చార్జిషీట్లో చేర్చారు.
చార్జ్ షీట్ లో ముగ్గురు సెలబ్రిటీల మీద అభియోగాలు నమోదు చేయడంతో వీరెవరనేది ఆసక్తిగా మారింది. ఆ ముగ్గురిలో ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోల పేర్లు ఉన్నట్టు సమాచారం. కెల్విన్ అనే డ్రగ్ డీలర్ అరెస్ట్ తర్వాత తీగ లాగితే టాలీవుడ్లో అల్లుకుపోయిన డొంక అంతా కదిలింది. ఇండస్ట్రీతో తనకు ఉన్న సంబంధాల గురించి అతడు దర్యాప్తులో చెప్పడంతో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. టాలీవుడ్‌కు చెందిన పదిమందికి నోటీసులు పంపి విచారణకు పిలిచారు. వీరిలో పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, చార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజులు ఉన్నారు. వీరిలో కొంతమంది నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరించి… ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇప్పుడు వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులు ఆధారంగానే ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేశారు. అయితే మరికొందరికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావాల్సివుందని, అవి కూడా వస్తే మరికొంతమందిని కూడా చేర్చే అవకాశం ఉందని సిట్ అధికారి అకున్ సబర్వాల్ తెలిపారు.