Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిత్ర పరిశ్రమ మరో ధృవతారను కోల్పోయింది. పల్లె పడుచుగా తెలుగు లోగిళ్లలో అడుగుపెట్టి….చదువుకున్న అమ్మాయిగా పరిణితి చెంది.. ఇలవేల్పుగా మారి .గుడిగంటలు మోగిస్తానని, వాగ్ధానం ఇచ్చి తెలుగు సినిమాను నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మార్చిన అలనాటి అందాల నటి కృష్ణకుమారి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 84 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారి ఈ ఉదయం ఆరుగంటలకు బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. 1933 మార్చి 6న పశ్చిమబెంగాల్ లోని నైహతిలో కృష్ణకుమారి జన్మించారు. 1951లో నవ్వితే నవరత్నాలు సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పటికే తెలగులో అగ్ర హీరోయిన్ గా ఉన్న షావుకారు జానకి చెల్లెలైన కృష్ణకుమారికి తొలి సినిమా తరువాత ఆఫర్లు క్యూ కట్టాయి. రెండు దశాబ్దాల కెరీర్ లో ఆమెతెలుగు, తమిళ ,కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో దాదాపు 110 చిత్రాల్లో నటించారు.
పల్లె పడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బందిపోటు, లక్షాధికారి, అంతస్థులు భార్యాభర్తలు, కులగోత్రాలు, గుడిగంటలు, వాగ్ధానం, పిచ్చిపుల్లయ్య, బంగారు పాప, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, నిత్యకళ్యాణం పచ్చతోరణం, ఉమ్మడి కుంటుంబం, ఇలవేల్పు, జయ విజయ, దేవాంతకుడు వంచి చిత్రాలు ఆమెకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలతో ఆమె హీరోయిన్ గా తనదైన ముద్ర వేశారు. ముఖ్యమంగా రాజకుమారి క్యారెక్టర్ లో ఆమె ఒదిగిపోయేవారు. యువరాణి పాత్ర అనగానే అప్పట్లో దర్శక నిర్మాతలకు ముందుగా ఆమే గుర్తువచ్చేవారు. తన నటనతో కృష్ణకుమారి రాష్ట్ర స్థాయి నంది అవార్డులతో పాటు మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు కృష్ణకుమారి. ఆమె సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. కృష్ణకుమారి అనగానే మనసు దోచే మధురగీతాలు కళ్లముందు కదలాడుతాయి. ఊహలు గుసగుసలాడే, మబ్బులో ఏముంది, నీ మౌనం, నా కంటి పాపలో, మనసున మనసై వంటి గీతాలు ఎవర్ గ్రీన్ హిట్స్.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు సరసన ఎక్కువ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో ఎక్కువభాగం ఘనవిజయాలు సొంతంచేసుకున్నాయి. కృష్ణకుమారిని అప్పటి తరం నటీనటులంతా ఎంతో అభిమానించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఆమె అంటే చాలా ఇష్టం. ఒకదశలో కృష్ణకుమారిని వివాహంచేసుకోవాలని కూడా ఎన్టీఆర్ అనుకున్నట్టు ఆ తరం వాళ్లు చెబుతుంటారు. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను పెళ్లిచేసుకున్న ఆమె ఆ నగరంలోనే స్థిరపడ్డారు. కృష్ణకుమారి దంపతులకు దీపిక అనే కుమార్తె ఉంది. కృష్ణకుమారి మృతిపై టాలీవుడ్ సంతాపం వ్యక్తంచేసింది.