ఆంధ్రప్రదేశ్ లో తొలి ట్రాన్స్ జెండర్ ఉద్యోగం సంపాదించింది. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ, బిఈడీ పట్టా ఉన్న జానకి అనే ట్రాన్స్ జెండర్ కు రాష్ట్ర హౌసింగ్ బోర్డు శాఖలో ఉద్యోగం కల్పించారు. ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలా గుర్తింపు ఇస్తామని 2017 చివర్లో ఏపీ ప్రభుత్వం పాలసీ ప్రకటించింది. ఈ పాలసీలో జానకి మొదటి లబ్దిదారు. 19లక్షల ఇళ్ల నిర్మాణం ధ్యేయంగా రాష్ట్ర హౌసింగ్ బోర్డు చేపట్టిన కార్యక్రమంలో జానకి డేటా ఎంట్రీ ఆపరేటర్ గా విధుల్లో చేరింది. జానకి జీతం నెలకు రూ. 15,000. ఈ సందర్భంగా సమాజంలో తాను ఎదుర్కొన్న అవమానాలు ఆమె గుర్తుచేసుకుంది.
తాను ట్రాన్స్ జెండర్ అని తెలిసినప్పటి నుంచి అందరూ హేళన చేసేవారని, తల్లిదండ్రులు కూడా అంగీకరించలేదని తెలిపింది. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ ఎక్కడా తనకు ఉద్యోగం రాకపోవడంతో అడుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తంచేసింది. ఇటీవల తమ కమ్యూనిటీకి ఆధార్, రేషన్ కార్డుల జారీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సలహా మేరకు హౌసింగ్ బోర్డులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. తనకు ఉద్యోగం వచ్చినప్పటికీ తల్లిదండ్రులు తన సహజత్వాన్ని అంగీకరించడం లేదని బాధపడింది.