తెలంగాణ రాష్ట్ర సమితి మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గానికి కె.మాణిక్ రావు, మలక్ పేటకు చావ సతీష్ కుమార్ పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ నిన్న ఖరారు చేశారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ లో గీతారెడ్డిపై పోటీ చేసి మాణిక్ రావు.. మలక్ పేటలో బలాలాపై పోటీ చేసి సతీష్ కుమార్ ఓడిపోయారు. మళ్లీ వారిద్దరికే ఆయా స్థానాల్లో అవకాశం కల్పించడం విశ్లేషకులకి ఆశ్చర్యాన్ని, మిగిలిన నియోజకవర్గాల్లోని ఆశావాహుల్లో ఆక్రోశాన్ని నింపింది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే ప్రకటించడానికి ప్రత్యేకంగా ఎందుకు పెండింగ్‌లో పెట్టాలన్న సందేహం కాగా ఈ రెండింటినే ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించడమన్న చర్చ మరో కారణం.
నిజానికి జహీరాబాద్ సీటును ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అదేమి విచిత్రమో కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాణిక్ రావుకే మళ్ళీ చాన్సిచ్చారు. ఇక మలక్ పేట ఎంఐఎం సిట్టింగ్ సీటు అక్కడ ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ కుమారుడు ఆజం ఆలీ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినా కేసీఆర్ పట్టించుకోలేదు. అక్కడ ఎంఐఎంతో ఉన్న అంతర్గత ఒప్పందాల మేరకు డమ్మీ క్యాండిడేట్ గా చావ సతీష్ కు చాన్సిచ్చారు. దీంతో ఈ రెండు స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించడంతో రేసులో ఉన్న మిగతా పెండింగ్ స్థానాల అభ్యర్థులు ఉసూరుమన్నారు. అంబర్ పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, చార్మినార్, చొప్పదండి, వరంగల్ తూర్పు, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, హుజూర్ నగర్, కోదాడలకు తెరాస అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఒక్క చార్మినార్ మినహా మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ ఉంది. అయితే బీజేపీ తాజాగా అభ్యర్ధులను ప్రకటించిన నేపధ్యంలో ఈ నియోజకవర్గాలలో కూడా అభ్యర్ధులను ఖరారు చేస్తారని అంతా భావించారు, కానీ వారదరినీ ఉసూరుమనిపించారు కేసీఆర్.