టీడీపీ అవిశ్వాసం…టీఆరెస్ హ్యండిచ్చింది !

TRS MP's Not Supported TDP's No Confidence Motion

ముందు ప్రకటించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం మీద టిడిపి ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. టిడిపి, కాంగ్రెస్, ఎన్‌సిపి సభ్యులు ఇచ్చిన ఈ తీర్మానాన్ని సభలో చదివి వినిపించారు. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన 50 మంది ఎంపీల మద్దతు ఉందని ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరగా అనేక పార్టీల ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలిపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీ ఉన్నారు. దాదాపు 50మందికిపైగా ఎంపీలు లేచి నిలబడి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు.

కాగా టీడీపీ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం తరపున ఒకేఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని విపక్ష నేతలంతా పట్టుబట్టారు. ఐతే దీనిపై ఇప్పుడే చర్చ జరగాలంటే కుదరదని, 10 రోజుల్లోపు ప్రకటిస్తానని స్పీకర్‌ చెప్పారు. స్పీకర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారు. దానికి సమాధానంగా స్పీకర్‌ నిబంధనల ప్రకారమే అవిశ్వాసం నోటీసులపై నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.