ఎంపీలు, తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఇప్పుడు గులాబీపార్టీలో చర్చకి దారితీస్తున్నాయి. అసెంబ్లీ రద్దు చేసిన రోజే ఎమ్మెల్యేలను కూడా ప్రకటించడంతో ఆనతి నుండే టీఆర్ఎస్ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో విస్తృతం ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ప్రచారంలో పాల్గోవాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. గులాబీ బాస్ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారానికి వెళుతున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులతో తమకున్న విభేదాలను మాత్రం వారు మరిచిపోవడం లేదు. ఈ కారణంగా ప్రచారం వారు పూర్తి స్థాయిలో చేయడంలేదు. అడపాదడపా పర్యటనలతో మమ అనిపించుకుంటున్నారు. గతంలో ఎంపీలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలపై ఎంపీలు ఫిర్యాదులు చేసుకున్న సందర్భాలున్నాయి. అప్పట్లో వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ ముఖ్యనేతలు పలుమార్లు ప్రయత్నించారు. అయినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు ఎంపీలు అభ్యర్థుల వెనుకే ఉంటూ అంతో ఇంతో సహకరిస్తున్నారు. కొందరు మాత్రం అభ్యర్థులతో సంబంధం లేకుండా విడిగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. తమ నోటి వెంట అభ్యర్థుల పేర్లు ధ్వనించకుండా ప్రచారం చేస్తున్న నేతలు కూడా ఉన్నారంటే వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
గత నాలుగేన్నరేళ్ళుగా ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాల కారణంగానే ఎంపీలు మనస్ఫూర్తిగా పనిచేయటం లేదని టీఆర్‌ఎస్ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. అయితే కొంతమంది ఎంపీలు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలవకపోతే లోక్‌సభ టిక్కెట్ మిస్ అవుతుందేమో, ఓకవేళ టిక్కెట్ ఇచ్చినా అప్పుడు గెలుపు కష్టం కావచ్చన్న భావనతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రచారానికి వెళ్తున్నారట. ఉదాహరణకి భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కి తన నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో విభేదాలున్నాయి. దీంతో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండానే రోజూ ఆయన ప్రచారానికి వెళ్తున్నారట. ఎంపీ నిధులు ఖర్చుచేసే విషయంలో స్థానిక శాసనసభ్యులమైన తమను సంప్రదించడం లేదనీ, తన వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలకే పనులు అప్పగించారనీ గతంలో ఎమ్మెల్యేలు బూర నర్సయ్యగౌడ్‌పై ఫిర్యాదుచేశారు.
దీంతో అది మనసులో పెట్టుకున్న ఆయన అభ్యర్థులను కలవకుండా ఆయన ఒక్కడే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదొక్కటి మాత్రమె కాదు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికీ, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ , జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కి కూడా ఎమ్మెల్యేలతో విభేదాలు ఉండడంతో వారు అందరూ తూతూమంత్రంగా పర్యటనలు సాగిస్తున్నారట. ఇక ఆదిలాబాద్ జిల్లా ఎంపీ నగేష్ బోధ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌కే నగేశ్ పరిమితమయ్యారట. అయితే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొదట్లో కాస్త దూరంగా ఉన్న ఈ మధ్యనే ప్రచారంలో కాస్త స్పీడు పెంచారు. వెంటనే ఆయన మీద పార్టీ మారుతున్నారు అని ప్రచారం జరగడంతో దాన్ని తిప్పికొట్టేందుకే ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిసింది. మొత్తానికి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం తెరాసకు పెద్ద దెబ్బ అని మాత్రం చెప్పక తప్పదు. ఇప్పటికయినా కేసీఆర్ ఆ విషయాన్నీ పట్టించుకుని సరిదిద్దుకుంటారో లేక వదిలేస్తారో ? మరి.