తెలంగాణ ఎన్నికల విజయాన్ని ప్రజలు సాధించిన విజయంగా కేసీఆర్ అభివర్ణించారు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ తమ పార్టీ స్వీయ తప్పిదాల కారణంగానే 15-16 చోట్ల ఓడిందన్నారు. ఖమ్మం జిల్లాలో తమ పార్టీ ఇలాగే ఓడిందని కేసీఆర్ తెలిపారు. ఖమ్మంలో మమ్మల్ని ఎవరూ ఓడించలేదు. మమ్మల్ని మేమే చంపుకున్నామంటూ గులాబీ బాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే గెలిచిన టీఆర్ఎస్ ఈ దఫా కూడా ఒక్క సీటే గెలుపొందింది. మిగతా 9 స్థానాల్లో 8 చోట్ల మహాకూటమి విజయం సాధించింది. వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రాములు నాయక్ గెలుపొందాడు. అనూహ్యంగా పాలేరు నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోయారు. తనకు సన్నిహితుడైన తుమ్మల ఓడటం కేసీఆర్‌ను కలచి వేసిందని ఆయన మాటలను బట్టి అర్థమైంది. సత్తుపల్లిలో పిడమర్తి రవి బాధ్యతలను తుమ్మలకు అప్పగించగా ఆయన కూడా ఓటమిపాలయ్యారు. మొత్తానికి ఖమ్మం జిల్లా ఫలితాల పట్ల కేసీఆర్ ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఆయన మాటలను బట్టే అర్థం చేసుకోవచ్చు.