Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేటి పనుల మీదే రేపటి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అది జీవితం అయినా రాజకీయం అయినా. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని చూసిన కొందరు తెరాస నేతలు అనుకుంటున్న మాటలు దీనికి ప్రబల ఉదాహరణ. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలోను, ఆ తర్వాత కూడా టీడీపీ ని తెరాస ప్రధానంగా టార్గెట్ చేసింది. తెలంగాణ రాకుండా అడ్డుపడుతోంది చంద్రబాబు అన్న విషయాన్ని కింది స్థాయి దాకా తీసుకెళ్లింది. ఇక తెలంగాణ వచ్చాక ,ఎన్నికల్లో గెలిచాక కూడా తెరాస ఆపరేషన్ ఆకర్ష్ లో కూడా టీడీపీ నే టార్గెట్. మొత్తానికి తెరాస అనుకున్నట్టే తెలంగాణాలో టీడీపీ దెబ్బతింది. ఆ పార్టీ శ్రేణులు కూడా టీడీపీ భవిష్యత్ మీద నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంతగా దెబ్బ తిన్న టీడీపీ ఓ విధంగా కాంగ్రెస్ కి వరమైంది.
తెలంగాణ రాజకీయాల్ని కాచివడపోసిన సీఎం కెసిఆర్ ఇప్పుడప్పుడే రాష్ట్రంలో గట్టి ప్రత్యర్ది వుండబోరని భావించారు. అయితే అంతా అనుకున్నట్టు జరగడం లేదు. ఎన్ని అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ తెలంగాణ లో కాంగ్రెస్ గట్టి ప్రత్యర్థిగా నిలదొక్కుకుంటోంది. ఇక ఉద్యమ సమయంలో కెసిఆర్ కి అండగా నిలిచి అనుకున్న ఫలితం పొందలేక దూరం అయిన శక్తులు సైతం ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతానికి పని చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఈ పరిణామాలు తెరాస కి ఇబ్బందికరంగా మారాయి. దీంతో అసలు తప్పు ఎక్కడ జరిగిందా అని ఆరా తీస్తే మరో ప్రత్యామ్న్యాయం లేకపోవడమే కాంగ్రెస్ కి కలిసి వస్తోందని తెరాస కి అర్ధం అయ్యిందట. అందుకే టీడీపీ స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేదని ఇప్పుడు కోరుకుంటున్నారు తెరాస నేతలు.