Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు డేరాలో చీమ చిటుక్కుమన్నా బయటకి వినిపించని స్థితి….వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆశ్రమ నిర్వహణకు ఎంత మందీమార్బలం అవసరముంటుంది…? బాబా భక్తిలో తరించేందుకు తల్లిదండ్రుల బలవంతంతో ఆశ్రమంలో చేరిన సాధ్విలు, నయానో, భయానో బాబా తన వెంట తెచ్చుకుని బందీలుగా మార్చిన మహిళలు, వారికి తోడు సాధారణ భక్తులు, సేవాదారులు, ఆశ్రమ భద్రతా సిబ్బంది, బాబా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇలా ఆశ్రమంలో ఎంతో మంది ఉండేవారు. అక్కడ నివసించేవారు, ఉద్యోగాలు చేసే వారు, సేవ చేసేందుకు వచ్చేవారితో పాటు బాబాను నిత్యం దర్శించుకోటానికి వచ్చేవారందరికీ బాబా అకృత్యాలు గురించి తెలుసు. డేరా బాబా నివాసగృహం పితాజీ గుఫా ఆయన చేతికి చిక్కే అమ్మాయిల పాలిట ఓ నరకకూపమని, అత్యాచారాలకు గురయ్యే అబలల ఆక్రందనలతో ప్రతిధ్వనించే పాపకూపమనీ, డేరాల చాటున భక్తి పేరుతో జరిగేవన్నీ అఘాయిత్యాలే అని వారందరికీ తెలుసు. కానీ నోరు మెదిపే ధైర్యం మాత్రం వారిలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నోరుతెరిచి ఈ అకృత్యాన్ని బయటకు చెబితే జరిగేదేమిటో వాళ్లకు స్పష్టంగా తెలుసు.
చిత్ర హింసలకు గురై తామో, తమ కుటుంబ సభ్యులో మరణించటమే జరిగేది కాబట్టి…కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొందరు తెగించి ముందుకు వచ్చిప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ భయంతో మరికొంతమంది మౌనముద్ర దాల్చారు. ఒకే వేళ ఈ అన్యాయానికి ఎదురు తిరిగి ఇదీ సంగతి అని చెబితే నమ్మేదెవ్వరు? నమ్మినా చర్యలు తీసుకునేదెవరు? అసలు ఆ వార్తలు రాసేదెవ్వరు? మన ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, సమానత్వం వంటివన్నీ…ఎంత బూటకమో డేరా సచ్చా సౌదా సామ్రాజ్యాన్ని రాక్ స్టార్ బాబా విస్తరించిన తీరు చూస్తే అర్ధమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదో సమాంతర ప్రభుత్వం అని చెప్పొచ్చు. సామాన్య ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే ఓ పెద్ద మనిషి దగ్గరకో, పోలీసు దగ్గరకో, ఇంకొంచెం ముందుకెళ్లి, ఏ ఎమ్మెల్యే వద్దకో, మంత్రి వద్దకో వెళ్లి చెబుతారు. కానీ వారందరినీ గుప్పిట్లో పెట్టుకున్న మనిషి మీద ఫిర్యాదుచేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్లాలి. అసలు పిర్యాదు స్వీకరించేదెవరు? ఈ సంచలన విషయాన్ని పత్రికల్లో రాసేదెవరు? ఇలాంటి వ్యవహారాలు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. ఫిర్యాదు చేయటానికి ఎవరో వస్తారు. కానీ ఆ ఫిర్యాదు స్వీకరించే వారు ఎవరూ ఉండరు?
చివరకు ఫిర్యాదు చేయాలనుకున్న వ్యక్తి ఏ బస్సు కిందో్, లారీ కిందో పడి చనిపోతాడు లేదంటే…అతని కుటుంబం మొత్తం హత్యకు గురవుతుంది. సరిగ్గా పంజాబ్, హర్యానాల్లో జరిగేది ఇదే. ఇలా ఎందరో డేరా అకృత్యాలు గురించి బయటకు చెప్పాలనుకుని హతులయ్యారు. ఆ రెండు రాష్ట్రాల్లో డేరా సచ్చా సౌదా గురించి అందరికీ తెలుసు…కానీ ఎవరికీ తెలియదన్నట్టే వ్యవహారం ఉంటుంది. డేరా సామ్రాజ్యం హర్యానా, పంజాబ్ నాలుగు చెరగులా విస్తరించి ఆయన ప్రభ అమోఘంగా వెలుగుతున్న కాలంలోఇలాంటి వ్యవహారాలు బయటికి రాకపోవటంలో అర్ధముంది. కానీ 2002లో డేరా బాబాపై ఫిర్యాదు అంది సీబీఐ విచారణ చేపట్టిన తర్వాత కూడా ఆయన సామ్రాజ్యం, పలుకుబడి చెక్కు చెదరలేదు. కేసు విచారణ సాగిన ఈ 15 ఏళ్ల కాలంలో డేరా బాబా జీవితంలో మార్పేమీ లేదు. దోషిగా నిర్ధారణ అయ్యేదాకా బాబా జీవితం ఓ రాజు తరహాలో్నే సాగింది. విచారణ సమయంలో్నూ బాబా హర్యానా రాజకీయాలను శాసించాడు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల చేత పాదాభివందనం చేయించుకున్నాడు. ఈ కాలంలో డేరాలో జరిగిన అకృత్యాలు ఇంకెన్నో…తన వ్యతిరేకులను మూడోకంటికి తెలియకుండా హతమార్చాడు. సామాన్యులనే కాదు..
డేరాఅకృత్యాలను ప్రచురించినందకుగానూఓపత్రిక ఎడిటర్ ను సైత డేరాఅనుయాయులు చంపేసారంటే….హర్యానాలో డేరా బాబా స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆ ఎడిటర్ కుమారుడు తమకు హర్యానా ప్రభుత్వం న్యాయం చేయకపోయినా సీబీఐ కోర్టు న్యాయం చేసిందని సంతోషం వ్యక్తంచేశాడు. ఇప్పుడు డేరా బాబాకు శిక్ష పడటంతో ఆయన అకృత్యాల గురించి అందరూ ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బాడీగార్డ్‌గా పనిచేసిన బియాత్ సింగ్ డేరా గురించి చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బాబా అసలు స్వరూపాన్ని కళ్లముందుంచి భయ|భ్రాంతులకు గురిచేస్తున్నాయి. బాబా ఆశ్రమంలో మగవారిని నపుంసకులుగా మార్చేవాడని, సేవ చేయటానికి వచ్చిన సాధ్విలను వంతుల వారిగా అనుభవించేవాడని బియాంత్ సింగ్ ఓ ఇంగ్లీష్ చానల్ తో్ చెప్పాడు. తాను బాబాకు బాడీగార్డ్ గా పనిచేస్తున్న సమయంలో …1995లో మౌంట్ అబులో బాబా సత్సంగ్ నిర్వహించాడని, అక్కడకు వచ్చిన 16 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా టెంట్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, బాలిక ఆర్తనాదాలతో ఆ టెంట్ మార్మోగిందని, అయినా…ఈ అకృత్యాన్ని అడ్డుకునే సాహసం తనతో సహా అక్కడున్న బాడీగార్డులెవ్వరూ చేయలేదని బియాంత్ సింగ్ చెప్పాడు.
ఆ బాలికను అప్పటినుంచి డేరాలోనే బందీగా ఉంచారని తెలిపాడు. డేరాలో ఉన్న 300 మంది సాధ్విల్లో 90 శాతం బాబా కామదాహానికి బలైనవారేనని తెలిపాడు. తనను కూడా నపుంసకుడిగా మార్చేందుకు ప్రయత్నించటంతో ఆశ్రమం నుంచి బయటకు వచ్చానని, ప్రాణభయంతో విదేశాలకు పారిపోయానని బియాంత్ చెప్పాడు. అత్యాచారాలు, హత్యలు డేరాల్లో నిత్యకృత్యమని, ఎంతోమందిని చంపివేసి ఆశ్రమంలోనే పూడ్చివేశారని, కొన్ని మృతదేహాలను పఖ్రా నదిలో పడేసేవారని చెప్పాడు. అంతేకాదు తన దత్తపుత్రికగా బాబా చెప్పుకుంటున్న హనీప్రీత్ కు, ఆయనకు మధ్య అంగీకార యోగ్యం కాని సంబంధం ఉందని తెలిపాడు. డేరాలో భారీ ఎత్తున నల్లధనం నిల్వలు కూడా ఉన్నాయని చెప్పాడు. మొత్తానికి ఇన్నేళ్లకు బాబా పాపం పండిఆయన దారుణాలు వెలుగుచూస్తున్నాయి. సేవ, దేవుడుముసుగులో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న బాబాలను భక్తులు నమ్మవద్దని పలువురు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు: