Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రమణ దీక్షితులు ఇరవై నాలుగేళ్ల పాటు తిరుమల వెంకన్నకి ప్రధాన అర్చకులుగా సేవలు అందించారు. ఆగమ సలహాదారునిగా వ్యవహరించారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరవై నాలుగేళ్ల పాటు ఆలయం మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచింది. అప్పట్లో ఆయన తీరుపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన సెలబ్రిటీ పూజారి అని ఆరోపణలు కూడా ఎదుర్కున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కర్నాటక ఎన్నికలు రేపు ఉన్నాయనగా అమిత్ షా తిరుమల పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయనతో దీక్షితులు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత రోజు నుంచే టీటీడీ పై ఆరోపణలు ప్రారంభించారని అర్ధం అవుతోంది. స్వయంగా తాను పర్యవేక్షిస్తున్న అంశాల్లోనూ తప్పులు జరిగినా దానికి ప్రభుత్వానిదే బాధ్యతన్నట్లు ఆరోపణలు చేశారు. ఈ విషయంలో రమణదీక్షితుల ఆరోపణలకు బీజేపీ, వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రమణదీక్షితులకు నేరుగా సపోర్ట్ చేశారు. ఆయన ఆరోపణలపై విచారణ చేయిస్తామన్నట్లుగా మాట్లాడారు. ఇటు వైసీపీ కూడా ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంది. దీంతో ఇప్పుడు తమ రాజకీయాల కోసం శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసిన ఆరోపణలకు… వివరణ ఇవ్వాలని… టీటీడీ బోర్డు రమణదీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని అర్చకులకి రిటైర్మెంట్ డేట్ ప్రకటించిన నాటి నుండి రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు.
విలువైన నగలు కనిపించడం లేదని కూడా చెబుతున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి.. తిరుమల శ్రీవారి నగలు… ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని.. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు గానీ, సీబీఐ గానీ ఆయన ఇంట్లో సీబీఐ రైడ్ చేయిస్తే అవి బయటకు వస్తాయని ఆరోపణలు ప్రారంభించారు. దీని పై టీటీడీ బోర్డు సీరియస్ అయింది. నిరాధారణ ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా… కావాలనే వీరు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని అలాగే టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. నిజానికి ఈ పరంపర వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతిన్నాయని భావించిన టీటీడీ ఇద్దరికీ మొదటి దశగా నోటీసులు జారీ చేసింది. చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని లేకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేరొన్నారు. నిజానికి ఈ నోటీసుల్ని స్వయంగా అందించడానికి టీటీడీ ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ వారు అందుబాటులో లేకపోవడంతో పోస్టు ద్వారా నోటీసులు పంపారు. దసల వారీగా టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరికొంత మందికి కూడా నోటీసులు ఇవ్వనున్నారని టీటీడీ న్యాయవిభాగం అధికారులు చెబుతున్నారు..