Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో టీవీ ఛానెళ్ళు మధ్య పోటీ పత్రికా రంగానికి కూడా విస్తరించబోతోంది. ఇప్పటిదాకా ఛానల్ విభాగంలో పోటీపడ్డ టీవీ 9 , టీవీ 5 ఇక భవిష్యత్ లో పత్రిక రంగంలో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టీవీ 9 రవిప్రకాష్ 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓ పత్రికను కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని కూడా తెలుస్తోంది. కొందరు పారిశ్రామికవేత్తలు , రాజకీయ నేతలు అందిస్తున్న అండదండలతో “వెలుగు “ పేరుతో దినపత్రిక తెచ్చేందుకు రవిప్రకాష్ సర్వసన్నద్ధం అయినట్టు చెప్పుకుంటున్నారు. 2018 లో ఈ పత్రిక తెలుగు పాఠకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం .
ఇక న్యూస్ ఛానల్ విభాగంలో టీవీ 9 కి సుదీర్ఘ కాలం పాటు పోటీ ఇచ్చిన టీవీ 5 కూడా ఓ దినపత్రిక మొదలెట్టబోతోందట. ఒకప్పుడు సంచలనం సృష్టించి ఈనాడు తో పోటీ పడ్డ “ఉదయం” టైటిల్ ను టీవీ 5 యాజమాన్యం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే టైటిల్ తో టీవీ 5 ఆధ్వర్యంలో “ఉదయం “ పత్రిక 2018 ఏప్రిల్ లేదా మే నెలలో జనం ముందుకు వచ్చే ఛాన్స్ ఉందట. 2019 ఎన్నికల నేపథ్యంలోనే టివీ 5 పత్రిక వైపు మొగ్గుజూపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి పత్రిక నెలకొల్పే విషయంలో abn రాధాకృష్ణ ఇటు రవిప్రకాష్ , అటు నాయుడు కు స్ఫూర్తి అని తెలుస్తోంది. ఛానల్ రేటింగ్ విషయంలో తమ కన్నా వెనుకబడి ఉన్నప్పటికీ ఆంధ్రజ్యోతి పత్రిక వల్లే రెండు తెలుగు ప్రభుత్వాలు రాధాకృష్ణ మాటకు విలువ ఇస్తున్నాయని భావించిన ఈ ఇద్దరూ ఉదయంతో వెలుగు లు నింపడానికి వస్తున్నారు. చూద్దాం దినపత్రిక విషయంలో వీళ్ళు ఏ మాత్రం నెట్టుకొస్తారో ?