ప్రేమ పెళ్లిళ్లు, ఆపై పెద్దల పగలు, హత్యలు లేదంటే ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లో రోజుకొకటి జరుగుతున్న తరుణంలో రెండు విభిన్నమైన రెండు కేసులు హైదరాబాద్ పోలీసుల ముందుకు వచ్చాయి. ఓ యువతి వేధింపులతో మెరిట్ స్టూడెంట్ గా ఉన్న తాను ఇప్పుడు చదవలేకపోతున్నానని ఓ యువకుడు ఫిర్యాదు చేయగా, ఓ యువతి తన పై వివక్ష చూపుతోందంటూ మరో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ రెండు అంశాల మీదా ఎటువంటి సెక్షన్లు నమోదు చేయాలో అర్ధం కాని పోలీసులు తమ చట్టాల పరిధిలోకి రావని పోలీసులు వెల్లడించడంతో ఇవి రికార్డుల్లోకి ఎక్కలేదని తెలుస్తోంది.
వాటిలో కేస్ 1
ఓ డాక్టర్ కుమారుడైన విద్యార్ధి ఇంటర్ను 95 శాతం మార్కులతో పూర్తి చేశాడు. దీంతో కొడుకుని కూడా డాక్టర్ ను చేయాలన్న ఉద్దేశంతో నీట్ కోచింగ్ కోసం తల్లిదండ్రులు ఓ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. అదే సెంటర్ లో కోచింగ్ కు వస్తున్న ఓ యువతికి మూర్చరోగం ఉంది. క్లాసులో కుప్పకూలిన ఆమెకు ఇతను సపర్యలు చేయడంతో అప్పటి నుంచి ప్రేమ పేరిట సదరు యువతి వెంట పడటం మొదలు పెట్టింది. వాట్స్ యాప్ లో అభ్యంతరకరమైన మెసేజ్ లు పెట్టడం, తన అశ్లీల ఫోటోలను ఆమె పంపుతూ ఉండటంతో డిస్ట్రబ్ అయిన సదరు విద్యార్థికి వీక్లీ, మంత్లీ టెస్టులలో మార్కులు తగ్గిపోయాయి. ఈ విషయం యువకుడి తల్లికి తెలిసి, ఆ అమ్మాయికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో కుమారుడితో కలసి స్టేషన్ కు వచ్చిన ఆమె ఫిర్యాదు చేసింది.
కేస్ 2
ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన యువకుడు, అలాగే ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తరువాత వీరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. ఆ అమ్మాయి అతన్ని దూరంగా ఉంచడం మొదలు పెట్టేసరికి, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండేళ్లు తనతో సన్నిహితంగా మెలిగి, తన కుటుంబ నేపథ్యం తెలుసుకున్న తరువాత దూరం పెట్టడం వివక్ష కిందకు వస్తుందంటూ ఫిర్యాదు చేసి, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడా యువకుడు. ఈ రెండు విషయాల్లో ఏయే సెక్షన్లలో కేసు పెట్టాలో తమకు తెలిదంటూ పోలీసులు నమస్కారం పెట్టడంతో ఇప్పుడు కోర్టుకు వెళ్ళే పనిలో ఉన్నారు ఫిర్యాదు దారులు.